జనవరి 18 తర్వాత విజయమాల్యా ఆస్తుల వేలం: అనుమతినిచ్చిన కోర్టు

01-01-2020 Wed 13:01
  • ఈలోగా కావాలంటే ముంబై కోర్టులో అప్పీల్ కు అవకాశం 
  • బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యా 
  • ఆయన ఆస్తుల విలువ రూ.13 వేల కోట్లు అని అంచనా

లిక్కర్ కింగ్ విజయమాల్యాకు కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అతని ఆస్తులు వేలం వేయాలని ఆదేశించింది. బ్యాంకులకు దాదాపు ఆరువేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఈ బిజినెస్ మ్యాన్ ఆస్తుల విలువ దాదాపు 13 వేల కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా. మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా 2016 మార్చిలో లండన్ కు పారిపోయాడు.

2017లో అరెస్టయి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. అయితే మాల్యా ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. దీంతో తమకు భారీమొత్తంలో బకాయి ఉన్నాడంటూ ఎస్ బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం కోర్టును ఆశ్రయించి, అతని ఆస్తులు వేలంవేసి తమ అప్పులకు జమ చేయాలని కోరారు.

దీంతో కోర్టు ఆస్తులు జప్తు చేసిన ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారుల అభిప్రాయాన్ని కోరింది. ఆస్తుల లిక్విడేషన్ కు తమకు ఎటువంటి అభ్యంతం లేదని ఈడీ అధికారులు కోర్టుకు తెలియజేయడంతో వేలానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే జనవరి 18 తర్వాత మాత్రమే వేలం వేయాలని ఆదేశిస్తూ, ఈలోగా ముంబై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం మాల్యాకు ఇచ్చింది.