Chandrababu: అప్పటికి జగన్ పుట్టనేలేదు... ఇప్పుడేంటి సమస్య?: చంద్రబాబు సూటి ప్రశ్న

  • 1953లో అమరావతి ప్రాంతంలో వరదలు
  • కొండవీటి వాగు నుంచి మాత్రమే ముప్పు
  • దానిపైనా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాము
  • ఎర్రబాలెంలో రైతులను ఉద్దేశించి చంద్రబాబు

"1953లో అమరావతి ప్రాంతానికి వరదలు వచ్చాయి. అప్పటికి జగన్ పుట్టనే పుట్టలా. ఈయన పుట్టక ముందే వరదలు వచ్చాయి. ఆ తరువాత రాలేదు. అమరావతి ప్రాంతానికి కృష్ణా నది నుంచి ముప్పు లేదు. ఉన్నదల్లా కొండవీటి వాగు నుంచే. ఆ వాగుపై కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాము. ఇప్పుడు జగన్ ముందున్న సమస్య ఏంటి?" అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ ఉదయం ఎర్రబాలెంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్టుగానే అమరావతిని కూడా అభివృద్ధి చేయాలని భావించానని అన్నారు.

తానిచ్చిన ఒక్క పిలుపుతో రైతులంతా ముందుకు కదిలివచ్చి 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేసిన చంద్రబాబు, ఇప్పుడు రాజధానిని మారుస్తామంటే, వారు పడుతున్న ఆవేదన చూసి తన మనసు చలించి పోతున్నదని అన్నారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేసిన ఆయన, రాజధానిని తరలిస్తామని చెబితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అమరావతి ప్రాంతంలో భూమి విలువ పెరిగితే జగన్ కు కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు.

రైతులతో మాట్లాడుతుంటే తనకు ఎంతో బాధ కలుగుతోందని, అమరావతి ప్రాంతం ఎంతో సురక్షితమని నిపుణులు చెప్పిన తరువాతనే రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, వాటన్నింటినీ భరిస్తూ ముందుకు సాగామని చెప్పారు. భావి తరాల కోసం ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేశామని అన్నారు. రాజధాని కోసం త్యాగం చేసిన రైతులు ఇప్పుడు మనో వేదనలో ఉన్నారని, వారి బాధను తీర్చేందుకు తాను శ్రమిస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

More Telugu News