Chandrababu: ఇంద్రకీలాద్రిలో చంద్రబాబు పూజలు... జగన్ కు, మంత్రులకు మంచి మనసు ఇవ్వాలని కోరుకున్న టీడీపీ అధినేత

  • ఏపీ రాజధాని అమరావతిని పరిరక్షించాలి
  • ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలని దుర్గమ్మను కోరుకున్నా
  • భావితరాల భవిష్యత్తు బాగుండాలి 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గను దర్శించుకున్నారు. దుర్గమ్మ ఆలయంలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... ఏపీ రాజధాని అమరావతిని పరిరక్షించాలని, ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలని దుర్గమ్మను తాను కోరుకున్నానని చెప్పారు. భావితరాల భవిష్యత్తు బాగుండాలని ఆయన అన్నారు.

దేవుళ్లందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రి జగన్ కు, మంత్రులకు మంచి మనసు ఇవ్వాలని కోరుతున్నానని చంద్రబాబు అన్నారు. నూతన ఏడాది మొదటిసారిగా తాను దుర్గమ్మను దర్శించుకొని, ఇదే కోరిక అడిగానని చెప్పారు.

రాష్ట్రానికి రాజధాని ఉండాలని త్యాగాలు చేసిన రైతులు.. ఇప్పుడు చేస్తోన్న ఆందోళనలకు సంఘీభావం తెలపడానికి తాను వెళ్తున్నానని చంద్రబాబు అన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులకు సంబంధించిన విషయం ఇదని అన్నారు. గతంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని అన్నారు.

ఇప్పుడు అమరావతిలో చేయాల్సిన అభివృద్ధి పనులు భావితరాల భవిష్యత్తుకు సంబంధించని విషయమని చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి అమరావతి పరిరక్షణ కోసం సంకల్పంతో ముందుకు వెళ్లాలని ఆయన కోరారు.

తాను గతంలో విజన్ 2020 అని ప్రకటిస్తే అవహేళన చేశారని చంద్రబాబు అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో చూస్తే విజన్ 2020 కనపడుతుందని అన్నారు. అమరావతి పరిరక్షణ సమితికి పలువురు విరాళాలు ఇస్తున్నారని చెప్పారు. అనంతరం ఆయన రాజధానిలో ఆందోళన తెలుపుతున్న రైతులను పరామర్శించడానికి వెళ్లారు.

More Telugu News