TTD: తిరుమల వెంకన్న భక్తులకు షాక్.. లడ్డూలపై రాయితీ ఎత్తివేత!

  • ఉచితంగా ఒకటి.. రూ.50 చొప్పున ఎన్నైనా..
  • వైకుంఠ ఏకాదశి నుంచే అమల్లోకి
  • రాయితీ వల్ల ఏడాదికి రూ.250 కోట్లకుపై గా నష్టం

తిరుమల శ్రీవారి భక్తులకు ఇది కొంత చేదువార్తే. ఇప్పటి వరకు భక్తులకు విక్రయిస్తున్న లడ్డూలపై రాయితీని ఎత్తివేసి, ఇకపై ఒక్కో లడ్డూను ఏభై రూపాయలకు విక్రయించాలని నిర్ణయించింది. ఈ నెల ఆరో తేదీన వైకుంఠ ఏకాదశి నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఒక్కో లడ్డూ తయారీకి సుమారు రూ.40 ఖర్చవుతుండగా, ఇకపై దానికి పది రూపాయలు కలిపి రూ.50లకు భక్తులు కోరుకున్నన్ని లడ్డూలు విక్రయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది.

ప్రస్తుతం కాలినడకన వస్తున్న భక్తులకు ఒక ఉచిత లడ్డూను ఇస్తోంది. రోజుకు 20 వేల మంది భక్తులకు ఇలా అందిస్తోంది. దివ్య దర్శనం, టైంస్లాట్, సర్వదర్శనం భక్తులకు రెండు లడ్డూలు పది రూపాయలకు, మరో రెండు లడ్డూలను రూ.25కి విక్రయిస్తోంది. అలాగే, రూ.300 టికెట్‌పై ప్రత్యేక దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, విశేష ఆర్జిత సేవల భక్తులకు రెండేసి లడ్డూలను ఉచితంగా ఇస్తోంది.

ఇకపై రాయితీలు ఎత్తివేసి ప్రతీ భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ, 50 రూపాయలకు కావాల్సినన్ని లడ్డూలు ఇవ్వనుంది. లడ్డూ ప్రసాదంపై రాయితీ వల్ల ఏడాదికి రూ.250 కోట్లకు పైగా భారం పడుతుండడంతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది.

More Telugu News