Pawan Kalyan: రైతులేం చేశారు.. జగన్‌లా 17 నెలలు జైలులో కూర్చున్నారా?: నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్

  • రైతులు దొంగలు, దగాకోర్లు కాదు
  • వారేమీ సూట్‌కేసు కంపెనీలు పెట్టలేదు
  • టీడీపీ చేసిన అతి పెద్ద తప్పు అదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన తెలుపుతున్న రైతులకు మద్దతుగా నిన్న అమరావతి ప్రాంతంలో పర్యటించిన పవన్.. జగన్‌పై నిప్పులు చెరిగారు.

 రైతులు చేసిన తప్పేంటని ఆయన ప్రశ్నించారు. జగన్‌లా వారు సూట్‌కేసు కంపెనీలు పెట్టి 17 నెలలు జైలులో కూర్చోలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులు దొంగలు, దగాకోర్లు కాదన్నారు. పార్టీలన్నీ కలిసి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఏదో పెద్దకొడుకులా ఉంటాడని జగన్‌ను గెలిపిస్తే.. ఆ కొడుకు ఈ రోజు వారిని ఇంట్లోంచి గెంటేశాడని మండిపడ్డారు.

పవన్ అదే సమయంలో టీడీపీపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఎంత మేరకు పూర్తయిందో ప్రజలకు వివరించగలిగి ఉంటే ఇప్పుడీ పరిస్థితి దాపురించేది కాదని పవన్ అన్నారు. ఇంకా రెండుకళ్ల సిద్ధాంతం అంటే కుదరదని, ఇకనైనా అమరావతి గురించి గట్టిగా నిలబడాలని టీడీపీకి సూచించారు. రాజధానికి ఎంత ఖర్చు చేశారో, ఏం చేశారో ప్రపంచానికి చెప్పకపోవడమే టీడీపీ చేసిన అతి పెద్ద తప్పు అని జనసేనాని అన్నారు.

More Telugu News