Srikrishna committee: నాడు ఆ రెండు కమిటీలు రాజధాని రెండు చోట్ల ఉండాలని చెప్పలేదా?: మంత్రి కన్నబాబు

  • శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీలు చెప్పిన విషయం గుర్తులేదా?
  • జీఎన్ రావు కమిటీ కూడా అదే విషయాన్ని చెబుతోంది
  • ఒకే చోట రాజధాని ఉండాలని ఏ కమిటీ అయినా చెప్పిందా?

రాజధాని ఒక్క చోట కాదు రెండు చోట్ల ఉండాలని ఏపీ పునర్విభజన సమయంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ, విభజన తర్వాత నియమించిన శివరామకృష్ణ కమిటీ చెప్పిన విషయాన్ని ఏపీ మంత్రి కన్నబాబు గుర్తుచేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీఎన్ రావు కమిటీ కూడా అదే విషయాన్ని చెబుతోందని అన్నారు. చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన నారాయణ కమిటీ లాంటిది ఈ కమిటీ కాదని, శ్రీకృష్ణ కమిటీలో, శివరామకృష్ణ కమిటీలో ఉన్న సభ్యులు కొంత మంది జీఎన్ రావు కమిటీలోనూ ఉన్నారని చెప్పారు.

ఒకే చోట రాజధాని ఉండాలని ఏ కమిటీ అయినా చెప్పిందా? చెబితే ఆ నివేదికలు చూపించండి అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ఉన్న కొంత మంది భూములు, ఆస్తులు పోతాయని చేసే ఆందోళనలను రాష్ట్ర ప్రజల బాధగా ఎందుకు చిత్రీకరిస్తారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో అభివృద్ది కావాలో వద్దో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణలు జరగొద్దా? ఒకే ప్రాంతంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి, మిగిలిన ప్రాంతాలను ఎడారిగా వదిలి వేయాలా? అని ప్రశ్నించారు.

More Telugu News