Andhra Pradesh: రాజధాని పరిణామాలపై ఆవేదనతో బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు

  • ఏపీ రాజధానిపై అనిశ్చితి
  • ట్విట్టర్లో లేఖ పోస్టు చేసిన చంద్రబాబు
  • టీడీపీ వేడుకలు జరుపుకోవడం లేదని వెల్లడి

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏపీ రాజధాని అమరావతి చుట్టూ ముసురుకున్న పరిణామాల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. అమరావతి ఆందోళనల కారణంగా తెలుగుదేశం పార్టీ ఈసారి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడం లేదని పేర్కొన్నారు. వేలాదిగా నిరసనలు తెలుపుతున్న రైతులు, రైతు కూలీలతో జత కలుస్తామని తెలిపారు.

"ఆంధ్రప్రదేశ్ కు ఇది కష్టకాలం. జగన్ ప్రభుత్వం ఉన్న సమస్యలు పరిష్కారించాల్సింది పోయి కొత్త సమస్యలు సృష్టిస్తూ ప్రజలను కష్టాల్లోకి నెడుతోంది. మూడు రాజధానుల ప్రకటన రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేసింది. వేలాదిమంది రైతులు, కూలీలు, మహిళలు, చిన్నారులు, అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఎంతో ఆశతో అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చారు. అలాంటి వారి భవిష్యత్తులను ఊగిసలాటలో ఉంచడం మంచిది కాదు. వారి త్యాగాలు వృథా కారాదు.

నిరంకుశత్వానికి, అన్యాయానికి వ్యతిరేకంగా ఇలాంటి విపత్కర సమయంలో ప్రతి ఒక్కరూ రాజధాని రైతులకు, వారి కుటుంబసభ్యులకు మద్దతివ్వాలి. రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ ఈసారి టీడీపీ కొత్త సంవత్సర సంబరాలు జరుపుకోవడంలేదు. కొత్త సంవత్సర వేడుకల కోసం ఖర్చు చేసే సొమ్మును అమరావతి పరిరక్షణ సమితికి విరాళంగా ఇవ్వాలని అన్ని పార్టీల నేతలను, ప్రజలను కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ సమరోత్సాహంతో కదిలి అమరావతిని కాపాడుకుందాం" అంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.

More Telugu News