Janasena: పవన్ కల్యాణ్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్: వైసీపీ నేత అమర్ నాథ్

  • పవన్ హావభావాలను గమినిస్తే నటిస్తున్నట్టుగా ఉంది
  • ఈ విషయం ప్రజలు గమనించారు
  • 3 రాజధానుల ప్రతిపాదనపై పవన్ కు తేలు కుట్టినట్టుంది

రాజధాని అమరావతి ప్రాంత రైతుల పోరాటానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మద్దతు తెలిపేందుకు ఆ ప్రాంతంలో ఈరోజు పర్యటించిన విషయం తెలిసిందే. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమంటూ వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ హెచ్చరించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు స్పందించారు.

ఈ క్రమంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ పర్యటనలో పవన్ హావభావాలను గమనిస్తే నటిస్తున్నట్టుగా ఉందని, ఈ విషయం ప్రజలు గమనించారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగినప్పుడు చీమకుట్టినట్టుగా కూడా అనిపించని పవన్ కు, ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను సీఎం జగన్ చేసేసరికి తేలుకుట్టినట్టుగా ఆయనకు అనిపిస్తోందని విమర్శించారు.

రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులని తాము అనలేదని, టీడీపీ వాళ్లు శేఖర్ చౌదరి అనే ఓ జూనియర్ ఆర్టిస్టుని పొలాల్లో నిలబెట్టి మీడియాతో మాట్లాడించారని, అలాంటి వ్యక్తులను పెయిడ్ ఆర్టిస్ట్ లని కాక ఇంకేమంటారు? అని ప్రశ్నించారు. ‘అసలు, అందరి కన్నా పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్, పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్టుల సంఘానికి అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులు ఏ రోజు కూలీ ఆ రోజు తీసుకుంటారు కానీ, పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు ప్రీపెయిడ్, అప్పుడప్పుడు పోస్ట్ పెయిడ్ ఆర్టిస్టు అని తీవ్ర విమర్శలు చేశారు.

రాజధాని రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలోని పెద్దలు కానీ ఎవరూ చెప్పలేదని అన్నారు. ‘జై అమరావతి’ అని కాకుండా ‘జై ఆంధ్ర.. జైజై ఆంధ్ర’ అని నినదించాలని తుళ్లూరు పర్యటనలో పవన్ పిలుపునివ్వడంపై సెటైర్లు విసిరారు. ‘జై చంద్ర.. జై జై చంద్ర’ అని  పవన్ చెప్పుంటే బాగుండేదని అన్నారు.

More Telugu News