Chandrayaan: ఏప్రిల్ లో చంద్రయాన్-3... కేంద్రమంత్రి వెల్లడి

  • విఫలమైన చంద్రయాన్-2
  • చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిన విక్రమ్ ల్యాండర్
  • ఆ ఘటన నుంచి పాఠాలు నేర్చుకున్నామన్న జితేంద్ర సింగ్

చంద్రుడిపైకి యాత్రలను భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. చంద్రయాన్-1 ద్వారా జాబిల్లి ఉపరితలంపై నీటి ఆనవాళ్లు గుర్తించిన భారత్, ఆ తర్వాత చంద్రయాన్-2 వైఫల్యం చవిచూసింది. ఈ నేపథ్యంలో, భారత్ వెంటనే కోలుకుని చంద్రయాన్-3కి సన్నద్ధమవుతోంది.

దీని గురించి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఏప్రిల్ లో చంద్రయాన్-3 ఉంటుందని, ఇది ప్రపంచస్థాయి ఘటనలా నిలిచిపోతుందని అభివర్ణించారు. చంద్రయాన్ ప్రయోగాల్లో ఇది మూడోదని, దీని ద్వారా చంద్రుడిపై ఓ మనిషి దిగినట్టే భావించాలని అన్నారు.

చంద్రయాన్-2లో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలిన నేపథ్యంలో, తాము దాన్ని వైఫల్యంగా భావించడం లేదని, ఆ ప్రయోగం నుంచి ఎంతో విలువైన పాఠాలను నేర్చుకున్నామని తెలిపారు. అమెరికా సైతం అనేక వైఫల్యాల తర్వాతే అంతరిక్ష రంగంలో ప్రగతి సాధించిందని అన్నారు.

More Telugu News