Telugudesam: ‘ట్రాన్స్ ట్రాయ్’ లావాదేవీల్లో మా తండ్రి ప్రమేయం లేదు.. అవన్నీ సీఈవోనే చూసుకుంటారు: రాయపాటి కుమారుడు రంగారావు

  • ఉదయం ఐదు గంటలకు సీబీఐ అధికారులు వచ్చారు
  • లాకర్లు ఓపెన్ చేశారు.. హార్డ్ డిస్క్ లు తీసుకున్నారు
  • ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెప్పాను

యూనియన్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను ట్రాన్స్ ట్రాయ్ సంస్థ ఎగ్గొట్టిందన్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించి, కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాయపాటి కుమారుడు రంగారావు స్పందించారు. గుంటూరులోని తమ నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ఉదయం ఐదు గంటలకు సీబీఐ అధికారులు పది మంది వరకు వచ్చారని, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చినట్టు చెప్పారని అన్నారు.

ఆ అధికారుల్లో డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు ఉన్నారని, ట్రాన్స్ ట్రాయ్ వ్యవహారానికి సంబంధించిన అంశంపై సోదాల నిమిత్తం వచ్చినట్టు చెప్పారని, తమ నివాసం మొత్తం తనిఖీ చేయాలని అన్నారని తెలిపారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెప్పానని, తనిఖీలకు ఎటువంటి అభ్యంతరం లేదని వారికి చెప్పినట్టు పేర్కొన్నారు.

లాకర్లు ఓపెన్ చేశారని, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారని, ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ చూశారని, అవన్నీ లీగల్ గానే ఉన్నాయని, ఆ కంపెనీకి తమకు ఎటువంటి సంబంధం లేదని అధికారులకు చెప్పామని అన్నారు. ఒక లాకర్ తాళం మాత్రం హైదరాబాద్ లో ఉందని చెబితే, ఆ లాకర్ ఓపెన్ చేసి చూసిన తర్వాతే వెళతామని తమతో అధికారులు చెప్పారని వివరించారు.

గతంలో ట్రాన్స్ ట్రాయ్ డైరెక్టర్ గా తన తల్లి ఉండేవారని, 2016లో ఆమె చనిపోయిన తర్వాత తన తండ్రి రాయపాటి ఆ పదవిలో ఉన్నారని చెప్పారు. ట్రాన్స్ ట్రాయ్ కు రాయపాటి డైరెక్టర్ గా ఉన్నారు కనుక తమ విధి నిర్వహణలో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నట్టు చెప్పారు. ఏ ట్రాన్సాక్షన్ లోనూ తన తండ్రి ప్రమేయం లేదని, ట్రాన్స్ ట్రాయ్ సీఈఓ శ్రీధర్ చెరుకూరి అనే వ్యక్తి చూస్తున్నారని. ఈ వ్యవహారం మొత్తానికి ఆయనే బాధ్యుడని అన్నారు.

More Telugu News