amaravathi: హద్దులు చెరిపేసిన తర్వాత భూములు దున్నుకోమంటే ఎలా?: వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఫైర్

  • న్యాయం జరిగే వరకు పోరాటం ఆపొద్దు
  • అమరావతి రైతులకు అండగా ఉంటాం
  • ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అన్న వాళ్లకు సమాధానం చెబుతాం

హద్దులు చెరిపేసిన తర్వాత భూములు దున్నుకోమంటే ఎలా? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలోని మందడంలో పర్యటించిన పవన్ మాట్లాడుతూ, ‘మీ ఇడుపులపాయ ఎస్టేట్లు బలంగా ఉండాలి, మీ సిమెంట్ ఫ్యాక్టరీలు బలంగా ఉండాలి.. అమరావతికి భూములిచ్చిన రైతులను మాత్రం రోడ్ల మీద పడేసేయండి..’ అంటూ సీఎం జగన్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఇంతమంది ఆడపడుచులు రోడ్లపైకి వచ్చి కన్నీరు పెట్టడం తాను ఏనాడూ చూడలేదని, అలాంటిది, మీరు ఈరోజున రోడ్లపైకి వచ్చి బాధపడటం, కన్నీరుపెట్టడం తనను కదిలించేస్తోందని అన్నారు.

రైతులను ‘పెయిడ్ ఆర్టిస్ట్ లు’ అని ఎవరైతే వ్యాఖ్యలు చేశారో, చెంప మీద కొట్టేంత బలమైన సమాధానం వారికి చెబుతామని ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్న విషయమై  స్పష్టత ఇవ్వాలని, అమరావతి రైతులకు న్యాయం జరగకుండా ఒక్క అడుగు కూడా వైసీపీ ప్రభుత్వం ముందుకు వేసేందుకు వీలులేదని హెచ్చరించారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనక్కి నెట్టబడ్డ ప్రాంతాలని, ఇక్కడి నాయకులకు మాత్రం ఎకరాలకు ఎకరాలు, కోట్ల రూపాయలు ఉంటాయి కానీ, ప్రజలు మాత్రం తమ బతుకుదెరువు కోసం వలసలు పోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు తాము అండగా ఉంటామని, పోరాట స్ఫూర్తిని నింపుకోవాలని కోరారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపొద్దని సూచించారు. ‘మీరు పోరాడటం ఆపితే నేనేమీ చేయలేను కానీ, పోరాడినంత కాలం ‘జనసేన’ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

More Telugu News