Maharashtra: రాజకీయాలకు అనర్హుడినంటూ మహారాష్ట్ర ఎమ్మెల్యే రాజీనామా

  • మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదనే...?  
  • మంత్రివర్గ విస్తరణ చేపట్టిన వెంటనే రాజీనామా 
  • రాజకీయాలకు దూరంగా ఉంటానన్న ప్రకాశ్ సోలంకీ  

రాజకీయాలకు తాను పనికిరానంటూ మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకీ ప్రకటించడమేకాక, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. బీద్ జిల్లా మజల్ గావ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సోలంకీ ఈ విషయాన్ని నిన్న రాత్రి వెల్లడించారు. ‘మంగళవారం నేను రాజీనామా చేస్తాను. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని నేను ఎన్సీపీ నేతలకు కూడా తెలిపాను. స్పీకర్ ను కలిసి నా రాజీనామా పత్రాన్ని అందిస్తా’ అని చెప్పారు.

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టిన కొన్నిగంటలకే సోలంకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన రాజీనామా నిర్ణయానికి, కేబినెట్ లో స్థానం దక్కకపోవడానికి ఎలాంటి సంబంధం లేదని సోలంకీ అన్నారు. అయితే.. కేబినెట్ విస్తరణ తాను రాజకీయాలకు అనర్హుడినని నిరూపించిందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రంలో ఉద్ధవ్ థాకరే సీఎంగా కాంగ్రెస్,శివసేన, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన విషయం తెలిసిందే. తాజాగా, సోమవారం మంత్రి వర్గ విస్తరణ జరిపారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, మొత్తం మూడు పార్టీలనుంచి 36 మంది మంత్రులు, సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

More Telugu News