Kanakamedala Ravindra Kumar: రాజధాని మార్పు, మళ్లీ హైకోర్టు ఏర్పాటు ఇక ఎవరి తరం కాదు: టీడీపీ ఎంపీ కనకమేడల

  • జగన్ సర్కారుపై కనకమేడల విమర్శనాస్త్రాలు
  • రాజధాని, హైకోర్టు అంశాలపై తనదైన విశ్లేషణ
  • ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రస్తావన

టీడీపీ న్యాయవిభాగం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ మీడియా సమావేశం నిర్వహించి రాజధానిపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించారు. జీఎన్ రావు కమిటీకి ఏం చట్టబద్ధత ఉందని ప్రశ్నించారు. సీఎం జగన్ నిర్దేశించిన మేరకు రిపోర్టు ఇచ్చిందని, వాస్తవానికి రాజధాని మార్పు, రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశాలు కమిటీ పరిధిలో లేవని అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడేలా జీఎన్ రావు కమిటీ సూచనలు చేసిందని కనకమేడల ఆరోపించారు.

మరింత కాలయాపన చేసేందుకు బోస్టన్ కమిటీ వేశామని చెబుతున్నారని, ఈ కమిటీ ఎప్పుడు వేశారో ఎవరికీ తెలియదని విమర్శించారు. బోస్టన్ కమిటీ నివేదిక జనవరి 3న వస్తుందని చెబుతున్నారని, ఈ రెండు కమిటీల నివేదికలపై పరిశీలన చేసేందుకు హైపవర్ కమిటీ నియమించారని, అందులో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు ఉన్నారని వివరించారు. అయితే జీఎన్ రావు, బోస్టన్ కమిటీలకు ఉన్న అర్హత ఏంటి? ఈ కమిటీలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కు లోబడి నిర్ణయాలు తీసుకోవాలా? లేక స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలా? అనేది పరిశీలించాల్సిన అంశమని అన్నారు.

"ఏ కమిటీ అయినాసరే చంద్రబాబు గారు వేయనివ్వండి, జగన్ మోహన్ రెడ్డి గారు వేయనివ్వండి, కేంద్రం వేయనివ్వండి... ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమల్లో ఉన్నంత కాలం ఆ చట్ట పరిధిలోనే కమిటీ నివేదికలపై నిర్ణయాలు తీసుకోవాల్సిందే తప్ప, చట్టాన్ని అతిక్రమించి వెళ్లేందుకు వీల్లేదు. దీన్నిబట్టి నేను చెప్పేదేంటంటే... రాజధాని మార్పు, తరలింపు అనేది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిధిలో లేదు. మూడు రాజధానులు నిర్మించే అధికారం అంతకన్నా లేదు. ఈ రెండు అంశాలను ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ స్పష్టంగా చెబుతోంది.

నిపుణులంటే జీఎన్ రావు, పీటర్, బోస్టన్ లు కాదు.. శివరామకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం ఒకే ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాజధాని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. దాని ప్రకారం చంద్రబాబు గారి ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రధాని మోదీగారు ప్రారంభోత్సవం కూడా చేశారు. ఏపీ రాజధానిగా అమరావతిని దేశచిత్రపటంలో పెట్టి, అన్ని రకాల జీవోలు జారీ చేసి, నాలుగున్నరేళ్లు ఇక్కడి నుంచి పాలన చేశాక, రాజధానిని మార్పు చేయాలని చూడడం రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా సాధ్యంకాదు.

ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మరో అంశం కూడా చెబుతోంది. సెక్షన్ 31 ప్రకారం సొంత హైకోర్టు ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాటు కలిగిన తరుణంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అమరావతిలో ఏపీ హైకోర్టును ఏర్పాటు చేసుకోవచ్చంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా హైకోర్టు ఏర్పాటుకు అమరావతి ప్రధానప్రాంతమని పేర్కొంటూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు.  దాని ప్రకారమే అమరావతిలో హైకోర్టు ఏర్పడింది.

ఇప్పుడు కర్నూలులో మళ్లీ హైకోర్టు ఏర్పాటుచేస్తామని జగన్ ప్రభుత్వం చెప్పడం మోసపూరితమైనది. ఇది చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం అవుతుంది. జీఎన్ రావు కమిటీ కాదు కదా, హైకోర్టు ప్రధానప్రాంతాన్ని మార్పించడం ఇక ఎవరి తరం కాదు. ఈ విషయం రాష్ట్రప్రభుత్వానికి తెలియదా? అంటే తెలుసు. కానీ చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవాలన్న నిరంకుశ ధోరణితో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందీ ప్రభుత్వం" అంటూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు.

More Telugu News