JC Diwakar Reddy: జేసీ బస్సులపై ఆర్టీఏ కొరడా.. ఆరు బస్సులు సీజ్

  • హైకోర్టు ఆదేశాలతో మూడు రోజుల క్రితమే రోడ్డుపైకి బస్సులు
  • అంతలోనే మళ్లీ అవే బస్సులు సీజ్
  • మండిపడుతున్న యాజమాన్యం

అనంతపురం టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ బస్సులపై ఏపీ రవాణాశాఖ అధికారులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ ఆరు బస్సులను సీజ్ చేశారు. అనంతరం వాటిని అనంతపురం ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. హైకోర్టు ఆదేశాలతో మూడు రోజుల క్రితమే బయటకు వచ్చిన ఈ బస్సులను అంతలోనే మళ్లీ సీజ్ చేయడం గమనార్హం.

జేసీ ట్రావెల్స్ బస్సులను ఇటీవలే అధికారులు సీజ్ చేశారు. దీంతో జేసీ హైకోర్టును ఆశ్రయించారు. తమ బస్సులను అక్రమంగా సీజ్ చేశారని కోర్టుకు తెలిపారు. విచారించిన కోర్టు.. సీజ్ చేసిన బస్సులను వెంటనే విడుదల చేయాలని ఆర్టీఏ అధికారులను ఆదేశించింది. దీంతో మూడు రోజుల క్రితమే అధికారులు ఆ బస్సులను జేసీకి అప్పగించారు. అయితే, మూడు రోజులు కూడా గడవకముందే అవే బస్సులను మళ్లీ సీజ్ చేయడం విశేషం. అధికారులు తమ ట్రావెల్స్ బస్సులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని జేసీ ట్రావెల్స్ యాజమాన్యం ఆరోపించింది.

More Telugu News