New Delhi: ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చలి.. 119 ఏళ్ల కనిష్టానికి పగటి ఉష్ణోగ్రత

  • ఢిల్లీలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
  • శ్వాస తీసుకోవడంలో ప్రజల ఇబ్బందులు
  • నోయిడాలో నేడు, రేపు స్కూళ్లకు సెలవు

గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నిన్న ఏకంగా 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత కనిష్టంగా ఉష్ణోగ్రత నమోదు కావడం గత 119 ఏళ్లలో ఇదే తొలిసారి. 1901లో ఇదే నెలలో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాగా, మళ్లీ ఇన్నేళ్లకు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఢిల్లీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పొగమంచులోని కాలుష్య కారకాల వల్ల శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా శ్వాసకోశ సమస్యలు, గుండెపోటు, న్యుమోనియా, ఆస్థమా, హైపర్ టెన్షన్ వంటి వాటితో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య 20 శాతం పెరిగింది.

మరోవైపు, పొగమంచు కారణంగా నిన్న 530 విమానాలు ఆలస్యంగా నడిచాయి. వీటిలో 20 విమానాలను దారి మళ్లించగా, నాలుగింటిని రద్దు చేశారు. ఇక, రైళ్లు అయితే, 2 నుంచి ఏడు గంటలు ఆలస్యంగా నడిచాయి. చలిగాలుల తీవ్రత పెరగడంతో నోయిడాలోని పాఠశాలలకు నేడు, రేపు సెలవులు ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 11.8 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

More Telugu News