Bank customers: కొత్త ఏడాదిలో బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్!

  • రూపే, యూపీఐ చెల్లింపులపై చార్జీల ఎత్తివేత
  • ఆన్ లైన్ లో డబ్బు పంపుకునే వారికి ఇకపై నెఫ్ట్ ఛార్జీలుండవు
  • ఎసీబీఐ ఏటీఎంలో నగదు విత్ డ్రా మరింత సురక్షితం

కొత్త ఏడాదిలో బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త. నూతన సంవత్సరం జనవరి 1 నుంచి వినియోగదారులకు పలు చార్జీల భారం తప్పనుంది. దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపే, యూపీఐ చెల్లింపులపై చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నిబంధన జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఇకపై రూపే, యూపీఐ ప్లాట్‌ఫాంలపై జరిపే చెల్లింపులపై ఎలాంటి చార్జీలుండవు. మరో వైపు ఎస్‌బీఐ తన కస్టమర్ల అకౌంట్లకు మరింత భద్రతను కల్పించేందుకు ఓ నూతన విధానాన్ని కొత్త ఏడాది ఆరంభం నుంచి అమలు చేయనుంది.  

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ ఇకపై ‘నెఫ్ట్‌’  చార్జీలను వసూలు చేయకూడదని బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే జనవరి 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వినియోగదారులు ఎలాంటి రుసుము లేకుండానే నెఫ్ట్‌ విధానంలో నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్‌ సంస్థ ఎస్‌బీఐ జనవరి 1వ తేదీ నుంచి ఏటీఎంలలో డబ్బులు విత్ డ్రా చేసే విషయంలో నూతన విధానాన్ని అమలు చేయనుంది. ఎస్‌బీఐ  ఏటీఎంల నుంచి రూ.10వేలు అంతకన్నా ఎక్కువగా నగదును విత్‌డ్రా చేస్తే వినియోగదారుల ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఏటీఎంలో వెరిఫై చేసుకోవడం ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను ఎస్‌బీఐ కస్టమర్లు ఏటీఎం సెంటర్‌కు వెళ్లినప్పుడు తప్పనిసరిగా తమ వెంట ఫోన్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది.

More Telugu News