India: మన దేశంలో మత వివక్ష లేదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలేమి కావాలి?: జీవీఎల్

  • మన క్రికెటర్స్ లో ఉన్న ముస్లింలను మత ప్రాతిపదికన ఎప్పుడూ చూడలేదు
  • సానియా మీర్జాను ఎంతో గౌరవించాం
  • బాలీవుడ్ ఖాన్స్  మతం గురించి మనమెప్పుడూ పట్టించుకోలేదు

మన దేశంలో మత వివక్ష లేదని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత క్రికెట్ టీమ్ కు అజారుద్దీన్ ఒకప్పుడు కెప్టెన్ గా వ్యవహరించారని, అలాగే, ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చిన జహీర్ ఖాన్, మహ్మద్ కైఫ్ వంటి వాళ్లు గొప్ప క్రీడాకారులని, వీళ్లను భారతీయులుగా చూశాం తప్పితే, మతం అనే కోణంలో చూడలేదని అన్నారు.

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంటే ఓ భారతీయురాలిగా ఆమెను మనందరం గౌరవించాం తప్పితే, హిందుమతానికి చెందిన వ్యక్తి కాదని ఎవరూ అనుకోలేదని చెప్పారు. అలాగే, అబ్దుల్ కలామ్ లాంటి గొప్ప సైంటిస్ట్ ని రాష్ట్రపతిని చేశామని, సిక్కు వర్గానికి చెందిన మన్మోహన్ సింగ్ ప్రధానిగా చేశారని, అంతకుముందు, రాష్ట్రపతిగా జైల్ సింగ్ పని చేశారని గుర్తుచేశారు.

బాలీవుడ్ టాప్ స్టార్స్ అనగానే మనకు వినిపించే పేర్లు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ అని, వాళ్లల్లో గొప్ప కళాకారులను చూస్తాం తప్పితే, వారు ఏ మతానికి చెందిన వారని మనం పట్టించుకోమని అన్నారు. అంటే, భారతదేశంలో కచ్చితంగా మత వివక్ష లేదన్న విషయం అర్థమవుతోందని చెప్పారు. మన దేశంలో ముస్లింల జనాభా 9 శాతం నుంచి దాదాపు 15 శాతానికి పెరిగిందని అన్నారు. మన దేశంలో ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ వివక్షకు గురికారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని అన్నారు.

More Telugu News