cm: జగన్ గారూ, రైతు కన్నీళ్లు రాష్ట్రానికి మంచిది కాదు: నారా లోకేశ్

  • రైతు భార్య ఆవేదన వీడియోను పోస్ట్ చేసిన లోకేశ్
  • రాజధాని రైతులం రోడ్డు మీద పడి ఏడుస్తున్నాం
  • మా నోళ్లు కొట్టొద్దంటూ ఆవేదన

ఏపీ రాజధాని అమరావతిని తరలించవద్దంటూ ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. రైతులతో పాటు వారి భార్యలు కూడా ఇదే విషయమై సీఎం జగన్ కు విన్నవించుకుంటున్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ రైతు భార్య మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న వీడియోను టీడీపీ నేత నారా లోకేశ్ పోస్ట్ చేశారు. రైతుల కన్నీళ్లు రాష్ట్రానికి మంచిది కాదని సీఎం జగన్ కు సూచిస్తూ ఓ ట్వీట్ చేసి ఈ వీడియోను జతపరిచారు.

‘జగన్మోహన్ రెడ్డి గారూ, పెద్దిరెడ్డి గారూ, రోడ్డు మీద పడ్డాం. మా నోళ్లు కొట్టొద్దు. ఇది న్యాయమేనా? మీకూ కుటుంబం ఉంది. పిల్లలు ఉన్నారు. రాజధాని పోతే మేము చచ్చిపోతాం. జగన్మోహన్ రెడ్డి గారూ, ఒక్కసారి ఆలోచించు.. రాజధాని వాళ్లు చచ్చిపోతారు. నువ్వు మనిషివే.. నీకూ మనసుంది. మా అమరావతి మా రాజధాని మాకు కావాలి.

బొత్స సత్యనారాయణ గారూ, అన్నీ చెప్పావు.. మమ్మల్ని ముంచేశావు. ‘శ్మశానం’ అన్నావు శ్మశానం చేసేశావు. ఎమ్మెల్యే శ్రీదేవి ఒక్కసారి కూడా రాలేదు. ఎక్కడున్నారు? బ్యూటీ పార్లర్ లో ఉన్నారా? రాజధాని రైతులం రోడ్డు మీద పడి ఏడుస్తున్నాం’ అంటూ రాజధానికి చెందిన ఓ రైతు భార్య ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News