Botsa Satyanarayana: బొత్స తన నత్తి మాటలతో రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నారు: పంచుమర్తి అనురాధ విమర్శలు

  • బొత్సపై పంచుమర్తి విమర్శలు
  • అనేక కేసుల్లో ఉన్న మీరా మాపై విమర్శలు చేసేదంటూ ఆగ్రహం
  • జగన్ ను ఎందుకు ప్రశ్నించరంటూ నిలదీత

ఏపీ రాజధాని అంశంపై నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఘాటుగా స్పందించారు. మంత్రి బొత్స తన నత్తి మాటలతో రాజధాని రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఫోక్స్ వ్యాగన్ కేసులు, సారా కేసుల్లో ఉన్న మీరా మాపై విమర్శలు చేసేది అంటూ నిలదీశారు. 'బుధవారం నుంచి ప్రెస్ మీట్లు మొదలుపెట్టి ఆదివారం నాటికి ఉత్తరాంధ్ర వెళ్లిపోతారు, ఇలాంటి పక్కదారి రాజకీయాలు చేస్తూ ఏం బావుకున్నారు బొత్స గారూ?' అంటూ పంచుమర్తి ప్రశ్నించారు.

అదాని కంపెనీ ఎందుకు వెళ్లిపోయిందో జగన్ కు వివరించి చెప్పే పరిస్థితిలో మీరు లేరు అంటూ విమర్శించారు. ఉత్తరాంధ్రపై మీకు కనికరం ఉంటే సీఎంను ఎందుకు ప్రశ్నించరు? లులూ ఎందుకు వెళ్లిపోయిందో జగన్ ను అడగగలరా? అంటూ ధ్వజమెత్తారు. తమను గెలిపించిన రైతులనే ఇవాళ పెయిడ్ ఆర్టిస్టులంటూ అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటేసినందుకు సిగ్గుపడుతున్నట్టు ఆ పార్టీ కార్యకర్తలే చంద్రబాబు ముందు గోడు వెళ్లబోసుకుంటున్నారని, సీఎం జగన్ కు దమ్ముంటే సర్కారును రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసిరారు.

More Telugu News