Kishan Reddy union minister of state: పాకిస్థాన్ లో మైనారిటీలు మూడు శాతానికి తగ్గిపోయారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • సీఏఏ చట్టం ఏ ఒక్క భారతీయుడికి వ్యతిరేకం కాదు
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని అమలు చేసి తీరుతాం
  • పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదు

సీఏఏను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నాను. ఈ చట్టం ఏ ఒక్క భారతీయుడికి వ్యతిరేకం కాదని చెప్పారు. సీఏఏ, ఎన్నార్సీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేశంలోని శక్తులతోపాటు విదేశీ శక్తులు కలిసి మోదీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

యూపీలో పోలీసులపై కొంతమంది విధ్వంసకారులు దాడులు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అమానుషమని అన్నారు. ‘పాక్, బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీల రక్షణ కోసం చట్టం తీసుకొచ్చాం. పాక్, బంగ్లాను ఇస్లామిక్ దేశాలుగా మార్చారు. పాకిస్థాన్ లో మైనారిటీల జనాభా మూడు శాతానికి పడిపోయింది. పాక్ లో మైనారిటీలంతా ఏమయ్యారు? చాలా మందిని హత్య చేశారు. అలాంటి వారిని ఆదుకోవడానికే మన్మోహన్ సింగ్ హయాంలో చట్టం తేవడానికి ప్రయత్నించారు. కానీ, కార్యరూపం దాల్చలేదు. బీజేపీ ప్రభుత్వం 2015లోనే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడు, రాజ్యసభలో మెజారిటీ లేని కారణంగా ఆమోదం పొందలేకపోయింది’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

More Telugu News