Ganguly: సెహ్వాగ్ ను ఓపెనర్ గా పంపేందుకు కారణం ఇదే: గంగూలీ

  • మా తరంలో పెద్ద మ్యాచ్ విన్నర్ సెహ్వాగ్
  • మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేస్తే నేను కూడా రాణించలేను
  • మొత్తం పరుగుల్లో సచిన్ సగం మాత్రమే సాధించేవాడు

దిగ్గజ క్రికెటర్లు టెండూల్కర్, ద్రావిడ్, సెహ్వాగ్, కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులంతా ఒకే సమయంలో కలిసి ఆడారు. అయితే తమ తరంలో అతి పెద్ద మ్యాచ్ విన్నర్ వీరేంద్ర సెహ్వాగేనని మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కితాబిచ్చారు.

మిడిలార్డర్ లో నీ స్థానంలో మాత్రమే ఆడటానికి అలవాటు పడకుండా... జట్టు కోసం అన్ని స్థానాల్లో ఆడేందుకు సిద్ధంగా ఉండాలని సెహ్వాగ్ కు తాను చెప్పానని... ఆ తర్వాత ఓపెనర్ గా బరిలోకి దింపానని తెలిపారు. వన్డేల్లో నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తే తాను కూడా రాణించలేనని... మిడిల్ ఆర్డర్ లో సచిన్ బ్యాటింగ్ చేసినా అతను చేసిన పరుగుల్లో సగం మాత్రమే సాధించేవాడని అన్నారు. అందుకే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి బ్యాటింగ్ చేయాలని సెహ్వాగ్ కు సూచించానని చెప్పారు.

మన దేశంలో సునీల్ గవాస్కర్ ను అత్యున్నత ఓపెనర్ గా భావిస్తామని... ఆయనకు సెహ్వాగ్ ఏమాత్రం తీసిపోడని గంగూలీ కితాబిచ్చారు. వీరిద్దరి బ్యాటింగ్ మ్యాచ్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ఆఫ్ స్టంప్ అవతలికి తరలిస్తే బంతి పాతబడుతుందని గవాస్కర్ అనుకుంటారని... బంతి పాతబడేంత వరకు దాన్ని సెహ్వాగ్ బాదుతుంటాడని చెప్పారు. ఇద్దరి శైలి వేరుగా ఉంటుందని తెలిపారు.

More Telugu News