NPR: 10 ఏళ్ల పాటు అవకాశమున్నా కాంగ్రెస్ చేయలేకపోయింది.. ఇదే నా ఆందోళన: ప్రశాంత్ కిశోర్

  • ఎన్నార్సీపై సోనియా అధికారిక ప్రకటన చేయాలి
  • 2003లోనే సీఏఏను తీసుకొచ్చారు
  • ఎన్పీఆర్ తర్వాత ఎన్నార్సీ చేపడతారు

జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రావడం, వచ్చే ఏడాది జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్) కార్యక్రమాన్ని చేపట్టనునున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)కి ఇవి తొలి అడుగులని నిరసనకారులు, విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఎన్నార్సీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీం మౌనంగా ఉండటాన్ని జేడీయూ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు.

ఎన్నార్సీపై సోనియాగాంధీ ఒక ప్రకటన చేస్తే పూర్తి క్లారిటీ వస్తుందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ధర్నాలు, ప్రదర్శనల్లో పాల్గొనడం బాగానే ఉందని... అయితే, కాంగ్రెస్ అధినేత్రి నుంచి ఎందుకు ఇంత వరకు అధికారిక ప్రకటన రాలేదో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. ఎన్నార్సీని అమలు చేయబోమని ప్రకటించాలంటూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సోనియాగాంధీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) చెప్పాలని అన్నారు.

ఎన్నార్సీని అంగీకరించబోమని ఇప్పటికే పది మంది కంటే ఎక్కువ ముఖ్యమంత్రులు ప్రకటించారని... వారిలో ఒక కాంగ్రెస్ సీఎం కూడా ఉన్నారని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఇతర ప్రాంతీయ పార్టీల్లో నితీశ్ కుమార్, మమత బెనర్జీ, జగన్ తదితరులు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ విషయానికి వస్తే వారి ముఖ్యమంత్రులు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరని... సీడబ్ల్యూసీనే అత్యున్నత నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఎన్నార్సీపై సోనియాగాంధీ ఇంతవరకు అధికారిక ప్రకటన ఎందుకు చేయలేదనేదే తన ఆందోళన అని అన్నారు.

2003లోనే సీఏఏను తీసుకొచ్చారని... 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని... సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని అనుకున్నప్పుడు దాన్ని సవరించే అవకాశం కాంగ్రెస్ కు ఉందని... కానీ, వారు ఆ పని చేయలేదని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఎన్పీఆర్, ఎన్నార్సీకి మధ్య ఉన్న తేడాను ఎవరూ నిరూపించాల్సిన అవసరం లేదని... ఎన్నార్సీకి ఎన్పీఆర్ తొలి అడుగనే విషయాన్ని డాక్యుమెంట్లే చెబుతున్నాయని అన్నారు.

ఇది ఏ ఒక్క వ్యక్తికో సంబంధించిన అంశం కాదని... ఈ విషయాన్ని రాష్ట్రపతి కూడా తన ప్రసంగంలో చెప్పారని తెలిపారు. ఎన్నార్సీ, ఎన్పీఆర్ లపై జరుగుతున్న డిబేట్ కు, పౌరసత్వ సవరణ బిల్లు 2003తో లింక్ ఉందని చెప్పారు. ఎన్పీఆర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అవసరమని భావిస్తే ఎన్నార్సీని కూడా చేపడుతుందని క్లియర్ గా ఉందని తెలిపారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో సందర్భంగా ప్రధాని మోదీ ఇప్పటికే ఎన్నార్సీపై మాట్లాడారని గుర్తు చేశారు.

More Telugu News