Nitish Kumar: నితీశ్ కుమార్ కు మద్దతిచ్చేందుకు షరతులు పెట్టిన అసదుద్దీన్ ఒవైసీ!

  • నితీశ్ కు దేశవ్యాప్తంగా మంచి పేరు
  • ఎన్డీయేకు దూరమైతే ఎన్నికల్లో మద్దతు
  • వివాదాస్పద చట్టాలను వ్యతిరేకించాలని సూచన

రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు మద్దతిచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. అయితే, కేంద్రం ఇటీవల తెచ్చిన వివాదాస్పద చట్టాలను నితీశ్ వ్యతిరేకించాలని, ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలని షరతులు విధించారు.

దేశాన్ని విభజించే వారితో కలిసుండే వారికి తాము మద్దతివ్వబోమని, ఇదే సమయంలో ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభిస్తే, నితీశ్ తో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉంటామని, అసెంబ్లీ ఎన్నికల్లో సపోర్ట్ ఇస్తామని తెలిపారు.

ఓ మంచి సీఎంగా నితీశ్ కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, దాన్ని ఆయన కాపాడుకోవాలని ఒవైసీ కోరారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు తాము చేస్తున్న పోరాటంలో కలిసిరావాలని అన్నారు. నితీశ్ ఎక్కడ తమకు దూరమవుతారోనన్న భయంతో, జేడీయూకు బీజేపీ కేంద్ర మంత్రి పదవిని ఆశ చూపుతోందని, నితీశ్ ఈ విషయంలో రాజీ పడరాదని కోరారు.

More Telugu News