Ramgopal Varma: నా ప్రధాన ఫైనాన్షియర్ జగన్... రూ. 50 కోట్లు ఇచ్చారు: రామ్ గోపాల్ వర్మ సెటైర్

  • దావూద్ ఇబ్రహీం రూ. 15 కోట్లు ఇచ్చారు
  • ఏ మూడ్ వస్తే ఆ పని చేసుకుంటూ పోతా
  • భవిష్యత్తులో నటిస్తానేమో
  • టీవీ చానెల్ ఇంటర్వ్యూలో వర్మ

"ఏదో ఒక రకంగా వైఎస్ జగన్ నాకు ఓ రూ. 50 కోట్లు ఇచ్చారు. మరో గుర్తు తెలియని వ్యక్తి 30 కోట్లు ఇచ్చారు. దావూద్ ఇబ్రహీం మరో 15 కోట్లు ఇచ్చాడు" అని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. జగన్, దావూద్ లు తనకు ప్రధానమైన ఫైనాన్షియర్స్ అని జోకులేశారు. తాజాగా ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన ఆయన, తానిప్పుడు ఫిల్మ్ మేకర్ అవతారంలో ఉన్నానని, ఆ సమయంలో ఏ మూడ్ వస్తే, ఆ పని చేస్తుంటానని అన్నారు.

తనకు సినిమాల్లో నటించాలన్న ఉద్దేశం ఇప్పటికి లేదని, భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. తాను అనౌన్స్ చేసిన సినిమాలు ఏదో ఒక సమయంలో తప్పకుండా బయటకు వస్తాయని స్పష్టం చేశారు. తన వద్ద మూడు సినిమాలు, మూడు వెబ్ సీరీస్ లు నిర్మాణంలో ఉన్నాయని, నయీమ్, శశికళలపై తీయదలచుకున్న సినిమాలు తప్పకుండా వస్తాయని అన్నారు.

"అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు" చిత్రం వల్ల తానేమీ నష్టపోలేదని చెప్పారు. ఈ సినిమా గురించి తాను ఏమి చెప్పినా, మీరు ఏమనుకోవాలో అదే అనుకుంటారని సెటైర్లు వేశారు. తాను నిర్మొహమాటంగా మాట్లాడుతానని అన్నారు. కావాలనుకుంటే కేఏ పాల్ పై పరువు నష్టం దావా వేస్తానని వర్మ చెప్పారు. తన తాజా చిత్రం ఓ సెటైరికల్ చిత్రమని, అందులో ఏ విధమైన బ్లేమ్ లేదని, ఎవరినీ కించపరిచేది కాదని చెప్పుకొచ్చారు. కేఏ పాల్ ను విమర్శిద్దామంటే అతనికి క్యారెక్టర్ అనేదే లేదని విమర్శలు గుప్పించారు. 

More Telugu News