Burari House: 11 మంది చావును ఒకేసారి చూసిన ఆ భవంతి... ఇప్పుడు ఒక రక్తపరీక్షల కేంద్రం!

  • గత సంవత్సరం జూలైలో మూకుమ్మడి ఆత్మహత్యలు
  • అప్పటి నుంచి చాలాకాలం ఖాళీగా ఉన్న బిల్డింగ్
  • డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన డాక్టర్
  • భవంతిలో దెయ్యాలున్నాయని ఇప్పటికీ ప్రచారం

న్యూఢిల్లీలోని బురారీ హౌస్... ఈ పేరు వింటే తెలియదేమోగానీ, గత సంవత్సరం జూలైలో, ఒకేసారి ముక్తి చెందాలన్న ఉద్దేశంతో, ఇంట్లోని 11 మంది మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్న ఇల్లని చెబితే, ఎవరికైనా గుర్తొస్తుంది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన తరువాత, చాలా కాలం బురారీ హౌస్ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ భవంతిలో ఓ డయాగ్నస్టిక్ సెంటర్ నడుస్తోంది. తనకు మూఢనమ్మకాలు ఏమీ లేవని అక్కడ రక్త పరీక్షల కేంద్రాన్ని నడిపిస్తున్న డాక్టర్ ఎన్ మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.

తనకు అటువంటి నమ్మకాలే ఉంటే ఇక్కడికి వచ్చేవాడిని కాదని, తన వద్దకు పరీక్షల నిమిత్తం వచ్చే వారికి కూడా ఇంతవరకూ ఎటువంటి సమస్యలూ ఎదురు కాలేదని అన్నారు. ప్రధాన రహదారికి దగ్గరగా ఉండటంతో, తన సెంటర్ చక్కగా పని చేస్తోందని ఆయన తెలిపారు.

కాగా, అప్పుడప్పుడూ ఇక్కడికి హిందూ పూజారులు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారని స్థానికులు చెబుతుండటం గమనార్హం. అయితే, ఈ పూజలు సాధారణమేనని, గౌరీ, విఘ్నేశ్వర పూజలు చేస్తున్నామని, ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు ఇటువంటి పూజలు సాధారణమేనని డాక్టర్ మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ భవంతిలో దెయ్యాలు ఉన్నాయని, చనిపోయిన వారి ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయన్న ప్రచారమూ ఈ ప్రాంతంలో జరుగుతూ ఉండటం గమనార్హం.

More Telugu News