Guntur District: చేస్తున్న తప్పుడు పనిని ప్రశ్నించినందుకు... డిగ్రీ చదువుతున్న కొడుకును చంపించిన తల్లి!

  • పెదవడ్లపూడిలో 40 రోజుల క్రితం హత్య
  • ప్రియుడి కోసం కుమారుడి హత్యకు ప్లాన్
  • కేసును ఛేదించిన పోలీసులకు ఎస్పీ అభినందనలు

గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని పెదవడ్లపూడిలో 40 రోజుల క్రితం హత్యకు గురైన హార్దిక్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. కన్న కొడుకు తన వివాహేతర బంధాన్ని ప్రశ్నించినందున, ప్రియుడితో కలిసి ప్లాన్ వేసిన హార్దిక్ తల్లే, కేసులో ప్రధాన నిందితురాలని పోలీసు అధికారులు వెల్లడించారు.

 వివరాల్లోకి వెళితే, నవంబర్ మూడో వారంలో ఓ తూము నుంచి దుర్వాసన వస్తుండటంతో మంగళగిరి రూరల్ పోలీసులు వెళ్లగా, నడుముకు పెద్ద రాయి కట్టగా, నీటిలోనే కుళ్లిపోయిన మృతదేహం బయటపడింది. ఇది హార్దిక్ రాయ్ అనే డిగ్రీ చదువుతున్న యువకుడిదని గుర్తించిన పోలీసులు, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, ఆపై విచారణ ప్రారంభించారు.

కేసు విచారణలో సీసీటీవీ కెమెరాలు, సెల్ ఫోన్ కాల్ డేటా వంటివి కీలకం అయ్యాయి. ఆపై తొలి అనుమానం తల్లిపైనే వచ్చింది. తమదైన శైలిలో విచారించిన పోలీసులు అసలు నిజాన్ని బయటకు తెచ్చారు. హార్దిక్ తల్లి కసుకుర్తి రాణి ప్రియుడు, పెదవడ్లపూడికి చెందిన చిలక బాలస్వామి ఈ హత్యకు పాల్పడ్డాడని వెల్లడైంది.

గత కొంతకాలంగా రాణికి, బాలస్వామికి వివాహేతర సంబంధం నడుస్తుండగా, దీన్ని గమనించిన హార్దిక్ నిలదీశాడు. తన ఆనందానికి అడ్డుగా ఉన్నాడన్న ఆగ్రహంతో, కుమారుడిని చంపాలని రాణి భావించింది. బాలస్వామితో కలిసి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా కొత్త దుస్తులు కొనిస్తానంటూ హార్దిక్ ను నమ్మించిన బాలస్వామి, రాణిని కూడా తీసుకుని, నందివెలుగు వద్దకు వెళ్లారు.

అక్కడ టిఫిన్ చేసిన అనంతరం, రాణిని పక్కకు తీసుకెళ్లి, హార్దిక్ ను తాను చంపేస్తానని చెప్పాడు. ఆమెను ఆటోలో ఇంటికి పంపించాడు. రాత్రి 7 గంటల సమయంలో హార్దిక్ మెడకు తాడును బిగించి హత్య చేశాడు. ఆపై సెకండ్ షో సినిమా చూసి, హత్య చేసిన ప్రాంతానికి వచ్చి, నడుముకు బండరాయి కట్టి, శవాన్ని తీసుకెళ్లి తూములో పడేశాడు. ఈ కేసులో నిందితులిద్దరినీ అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులను గుంటూరు అర్బన్ ఎస్పీ అభినందించారు.

More Telugu News