Danish kaneria: పదేళ్లు నా రక్తాన్ని ధారపోసి దేశం కోసం ఆడా: పాక్ క్రికెటర్ డానిష్ కనేరియా

  • డబ్బు కోసం దేశాన్ని తాకట్టు పెట్టిన వారిని జట్టులోకి స్వాగతించారు
  • నా వేళ్లు రక్తమోడుతున్నా బౌలింగ్ చేశా
  • మీకు కావాల్సింది నా చావేనా?

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఇటీవల వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. జట్టులోని ఏకైక హిందువు అయిన అతడిని జట్టు సభ్యులు హీనంగా చూశారని, అతడితో భోజనం చేసేందుకు కూడా నిరాకరించేవారని ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. షోయబ్ చెప్పింది నిజమేనని, జట్టులో తాను ఎదుర్కొన్న అవమానాలు అన్నీఇన్నీ కావని ఆ తర్వాత కనేరియా కూడా చెప్పుకొచ్చాడు.

అయితే, వీరిద్దరి ఆరోపణలను పాక్ జట్టు మాజీ క్రికెటర్లు కొందరు ఖండించారు. వారు చెప్పిందే నిజమైతే జట్టులో అతడు పదేళ్లు ఎలా ఆడగలిగి ఉండేవాడంటూ మియాందాద్ ఫైరయ్యాడు. డబ్బుల కోసం కనేరియా ఏమైనా చేస్తాడని తీవ్ర విమర్శలు చేశాడు.

మియాందాద్ వ్యాఖ్యలపై కనేరియా మండిపడ్డాడు. తానేమీ ఊరికనే పదేళ్లు కొనసాగలేదని, తన రక్తాన్ని చిందించి ఆడానని భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. తన వేళ్లు రక్తమోడుతున్నా బౌలింగ్ చేశానని గుర్తు చేశాడు. కొందరైతే దేశాన్ని తాకట్టుపెట్టి ఫిక్సింగ్‌లకు పాల్పడ్డారని ఆరోపించాడు. అయినా, వారిని జట్టులోకి తీసుకున్నారని, కానీ తానెప్పుడూ డబ్బు కోసం దేశాన్ని తాకట్టు పెట్టలేదని అన్నాడు. తాను చాలా కాలం నుంచి ఉపాధి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘మీకు ఇంకా ఏం కావాలి? నేను చనిపోవాలా?’’ అని కనేరియా ప్రశ్నించాడు.

More Telugu News