priyanka gandhi: హెల్మెట్ ధరించని ప్రియాంక గాంధీ.. జరిమానా విధించిన యూపీ పోలీసులు

  • సీఏఏ ఆందోళనల్లో అరెస్ట్ అయిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి
  • ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక
  • పోలీసుల కళ్లు గప్పి బైక్‌పై బయలుదేరిన వైనం

ద్విచక్ర వాహనంపై వెనక కూర్చుని హెల్మెట్ ధరించనందుకు గాను ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీకి, ఆ పార్టీ నేత ధీరజ్ గుర్జార్‌కు యూపీ పోలీసులు రూ.6100 జరిమానా విధించారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూపీలో జరుగుతున్న ఆందోళనల్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దారాపురి అరెస్టయ్యారు. దీంతో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం ప్రియాంక గాంధీ లక్నో వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

వారి కళ్లు గప్పి తప్పించుకున్న ప్రియాంక గాంధీ, పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ధీరజ్ గుర్జార్‌తో కలిసి బైక్‌పై బయలుదేరారు. వీరిద్దరూ బైక్‌పై వెళ్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే, బైక్ నడుపుతున్న ధీరజ్ కానీ, వెనక కూర్చున్న ప్రియాంక కానీ హెల్మెట్ ధరించకపోడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందుకు గాను రూ.6100 జరిమానా విధించారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినందుకు రూ.2500, హెల్మెట్లు ధరించనందుకు రూ.500, నిబంధనలు పాటించనందుకు రూ.300, తప్పుడు నంబరు ప్లేట్ కలిగినందుకు రూ.300, నిర్లక్ష్యంగా నడిపినందుకు రూ.2500 చొప్పున మొత్తంగా రూ.6100 జరిమానా విధించారు. ఇందుకు సంబంధించిన చలానను బైక్ యజమాని రాజ్‌దీప్ సింగ్‌కు పంపారు.

More Telugu News