Andhra Pradesh: నేడు ఏపీలో అమ్మఒడి జాబితా... పేరు చూసుకునేందుకు గ్రామ సచివాలయాల వద్ద మహిళల కిటకిట!

  • తమ పేర్లు ఉన్నాయో, లేదో చూసుకునేందుకు వస్తున్న మహిళలు
  • అభ్యంతరాలకు జనవరి 2 వరకూ గడువు
  • 9న బ్యాంకు ఖాతాల్లో రూ. 15 వేల చొప్పున జమ
  •  46,78,361 మంది లబ్దిదారుల గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు గ్రామ సచివాలయాల్లో విడుదల చేయనున్న నేపథ్యంలో, తమ పేర్లు ఉన్నాయో, లేదో చూసుకునేందుకు మహిళలు పెద్దఎత్తున తరలిరావడంతో, పలు ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.

సంపూర్ణ అక్షరాస్యత సాధన, పేదరికంతో పిల్లలు బడికి దూరం కావడాన్ని నిరోధించేలా, అమ్మఒడి పథకాన్ని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రైవేట్‌, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంటర్ వరకు చదువుతున్న పిల్లల తల్లులను లబ్దిదారులుగా ప్రకటించారు. వీరికి సంవత్సరానికి రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. ఇప్పటికే ఇంటింటికీ తిరిగిన గ్రామ, వార్డు వలంటీర్లు అర్హుల జాబితాను తయారు చేయగా, మొత్తం 46,78,361 మంది తల్లులను జగనన్న అమ్మ ఒడి పథకం లబ్దిదారులుగా తేల్చారు.

ఇక ఈ జాబితాను నేడు విడుదల చేయనున్నారు. ఆపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను జనవరి 2 వరకు స్వీకరిస్తారు. ఆపై 9న తుది జాబితాను విడుదల చేసి, అదే రోజున తల్లుల ఖాతాల్లో రూ. 15 వేల చొప్పున జమ చేస్తారు. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ఇప్పటికే జగన్ ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News