Hyderabad: ఇండియన్ ఎయిర్ హోస్టెస్ ను మోసం చేసిన సౌదీ యువకుడు!

  • హైదరాబాద్ లో చదువుతున్న సౌదీ యువకుడు
  • విమానంలో పరిచయమైన ఎయిర్ హోస్టెస్
  • నాలుగేళ్ల సహజీవనం తరువాత పెళ్లికి నిరాకరణ

ఢిల్లీకి చెందిన ఓ ఎయిర్ హోస్టెస్ ను ప్రేమ పేరిట లొంగదీసుకుని, నాలుగేళ్ల సహజీవనం అనంతరం పెళ్లికి నిరాకరించిన ఓ సౌదీ యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, న్యూఢిల్లీ, మహ్మద్ పూర్ ప్రాంతానికి చెందిన యువతి, సౌదీ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తుండగా, 2015లో దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వస్తుంటే, రియాద్ నివాసి అలీ అల్ ఖఫియా సాలెంతో పరిచయం ఏర్పడింది. తనను యమన్ దేశస్తునిగా చెప్పుకున్న అలీ, హైదరాబాద్ లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నానని చెప్పాడు. వీరిద్దరి పరిచయం తొలుత స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది.

ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. తాను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో, హైదరాబాద్ లోని పారామౌంట్ కాలనీలో అలీ ఇంట్లోనే నాలుగేళ్లుగా సహజీవనం చేశారు. ఎయిర్ హోస్టెస్ ఇండియాకు వచ్చినప్పుడల్లా, నాలుగైదు రోజులు హైదరాబాద్ లో అలీ ఇంట్లోనే ఉండేది. ఆమె నుంచి రూ. 15 లక్షల వరకూ డబ్బులు కూడా తీసుకున్నాడు. ఈ నెల తొలివారంలో రియాద్ నుంచి హైదరాబాద్ కు ఇద్దరూ వస్తున్న క్రమంలో పెళ్లి విషయాన్ని ఆమె ప్రస్తావించగా, తనకు ఆ ఉద్దేశం లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఆమె హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అలీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోయింది. అతని ఇంటికి తాళం వేసివుంది.

దీంతో ప్రియుడి ఆచూకీ కోసం బాధితురాలు హైదరాబాద్ లోనే మకాం వేసింది. అతను తరచూ ఓ పబ్ కు వెళ్తాడని తెలుసుకుని అక్కడే మాటు వేసింది. గత వారంలో అతను పబ్ కు రాగా, గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారాన్ని తెలిపింది. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అలీని పట్టుకుని, అరెస్ట్ చేశారు. అతనిపై చీటింగ్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.

More Telugu News