pardhasaradhi: రాజధానిపై బాబు తుగ్లక్‌ చర్యలే నేటి దుస్థితికి కారణం: వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి

  • అమరావతిని ఆదాయ వనరుగా భావించారు
  • ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను ఆధారాలతో సహా బయటపెట్టాం
  • అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యం

అమరావతిని కేవలం ఆదాయ వనరుగా పరిగణించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరువల్లే నేడీ పరిస్థితి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. బాబు తుగ్లక్‌ చర్యలు తమ ప్రభుత్వానికి గుదిబండగా మారాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆధారాలతో సహా బయటపెట్టామని, దాని వెనుక మర్మమేమిటో ప్రత్యేకించి చెప్పాల్సిందేముందన్నారు.

రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే లక్షా పది వేల కోట్ల రూపాయలు కావాలని, అంతమొత్తం పెట్టుబడి పెట్టే స్తోమత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో అమరావతిని పట్టుకుని ముందుకు సాగడం ఎలా? అని ఆయన ప్రశ్నించారు. అందుకే వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అడుగు వేస్తోందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి జగన్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.

ఇక, తిరుమలలోని గొల్లమండపం కూల్చివేత నిర్ణయంపై పార్థసారధి తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా ఉన్న యాదవుల మనోభావాలు దెబ్బతినే ఇటువంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న గొల్ల మండపాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్‌ దృష్టికి తీసుకువెళ్లి పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More Telugu News