Cricket: గంగూలీ మనసులో ఏముంది?.. చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్‌కు ఉద్వాసనేనా?

  • ఎంపిక కమిటీలో ఇద్దరిని మార్చాల్సి ఉందన్న దాదా 
  • ఆ బాధ్యత సీఏసీ చూసుకుంటుందని వివరణ 
  • రెండు మూడు రోజుల్లో సీఏసీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి

భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ గా కొత్త వ్యక్తి రాబోతున్నారా? అసలు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మనసులో ఏముంది? ఎంపిక కమిటీలో ఇద్దరిని మార్చాల్సిన అవసరం ఉందని ఇటీవల దాదా చేసిన వ్యాఖ్యల్లోని మర్మమేమిటి? ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఈ ఆసక్తికర చర్చ సాగుతోంది. 

ఎంఎస్‌కేకి గుడ్ బై చెప్పి కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని, ఈ విషయాన్ని గంగూలీ చూసుకుంటాడని ఇటీవల స్పిన్నర్ హర్భజన్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎంఎస్‌కే బాధ్యతలు చేపట్టి మూడేళ్లు దాటిపోవడం కూడా అతనిపై వేటు పడుతుందన్న ఊహాగానాలకు మరో కారణం.

చీఫ్ సెలెక్టర్ గా ఎం.ఎస్.కె.ప్రసాద్ జర్నీ సక్సెస్ ఫుల్ గానే కొనసాగినప్పటికీ ఇటీవల తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై సీనియర్ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ఆటగాడిగా అంతగా అనుభవం లేని అతను తీసుకుంటున్న జట్టు సభ్యుల ఎంపికలో లోపాలున్నాయన్నది సీనియర్ల వాదన.

ఈ నేపథ్యంలో ఇటీవల గంగూలీ ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఎంపిక కమిటీలో మార్పులు అవసరమే అయినా మొత్తాన్ని మార్చాల్సిన పనిలేదని, ఓ ఇద్దరిని మారిస్తే సరిపోతుందని వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) చూసుకుంటుందని ముక్తాయించాడు. కమిటీ ఏర్పాటుకు రెండు మూడు రోజుల సమయం పడుతుందని, ఆ తర్వాత మార్పులు ఉంటాయని వెల్లడించాడు.

దీంతో ఎంఎస్‌కేపై వేటు తప్పదని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి మొన్నటి వరల్డ్ కప్ తోనే ఎంఎస్‌కే పదవీ కాలం ముగిసినప్పటికీ ఆరు నెలలు పొడిగించారు. ఎంపిక కమిటీ చైర్మన్ గా ఎంఎస్‌కే మూడేళ్లు పనిచేయడం విశేషంగానే చెప్పాలి. పెద్దగా వివాదాలు లేకపోవడం, నొప్పించక తానొవ్వక అన్నట్లు సాగిపోవడం ఇందుకు కొంత కారణం.

లోథా సిఫారసులు కూడా ఎంఎస్‌కేకు విశ్రాంతి ఇవ్వాలనే చెబుతున్నాయి. దీంతో ఎంఎస్‌కేతోపాటు పదవీ కాలం ముగిసిన సెలెక్టర్ గగన్ ఖోడాలకు ఉద్వాసన తప్పదని భావిస్తున్నారు. మిగిలిన దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజసి, శరణ్ దీప్ సింగ్ పదవీ కాలం మరో ఏడాది ఉంది. అందువల్ల ఎంఎస్‌కే, గగనఖోడాల స్థానంలో ఎవరిని నియమిస్తారన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది.

More Telugu News