Devineni Uma: విశాఖలో ఈ లావాదేవీలన్నీ నిజమా? కాదా?.. చెప్పండి: దేవినేని ఉమ

  • నీళ్ల కుండీల జంక్షన్ వద్ద 100 ఎకరాల లేఔట్ సంగతేంటి?
  • మాజీ సైనికాధికారుల నుంచి లాక్కున్న 175 ఎకరాల మాటేమిటి?
  • విశాఖలో ఏడు నెలల్లో 36 వేల ఎకరాల లావాదేవీలు జరిగాయి

విశాఖలో పులివెందుల పంచాయితీలు మొదలయ్యాయని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. టైకూన్ రెస్టారెంట్ వద్ద 3.9 ఎకరాల క్రిస్టియన్ ప్రాపర్టీకి విజయ్ అనే వ్యక్తి అడ్వాన్స్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. ఆడిటర్ జీడీ, కేవీఆర్, కృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి వీరంతా ఎవరని... వీరు కొన్న ఆస్తులేంటని ప్రశ్నించారు. నీళ్ల కుండీల జంక్షన్ వద్ద పద్మనాభం గుడికి వెళ్లే దారిలో 100 ఎకరాల లేఔట్ సంగతేమిటని నిలదీశారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారితో ఎలాంటి మ్యాపింగులు చేయించారని ప్రశ్నించారు.

కొత్త జైలు రూట్లో ఉన్న గోల్ఫ్ క్లబ్ మీద మీ కన్ను పడిన మాట వాస్తవం కాదా? అని దేవినేని ఉమ అడిగారు. భీమిలి దగ్గర మూడెకరాల మీ నివాసం సంగతేంటి? 35 మంది ఆర్మీ మాజీ అధికారుల నుంచి లాగేసుకున్న 175 ఎకరాల విషయం ఏమిటి? అని ప్రశ్నించారు. భీమిలి వద్ద, భోగాపురం ఎయిర్ పోర్ట్ వద్ద 6 వేల ఎకరాలు మీ సన్నిహితుల చేతులు మారాయని ఆరోపించారు. ఈ ఏడు నెలల్లో విశాఖలో 36 వేల ఎకరాల లావాదేవీలు జరిగాయని... వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇన్సైడర్ ట్రేడింగ్ లో పాల్గొన్నారని చెప్పారు.

More Telugu News