Mallu Bhatti Vikramarka: బీజేపీకి టీఆర్ఎస్, ఎంఐఎం మద్దతు పలుకుతున్నాయి: మల్లు భట్టివిక్రమార్క

  • ర్యాలీని వాయిదా వేసుకోలేదు
  • మా వ్యూహాలు మాకు ఉన్నాయి
  • కేసీఆర్ కు కాంగ్రెస్ భయం పట్టుకుంది

హైదరాబాదులోని గాంధీభవన్ లో టీకాంగ్రెస్ నేతలు ఈరోజు సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. శాంతియుతంగా తాము నిర్వహించాలనుకున్న ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అన్నారు.

తాము ర్యాలీ నిర్వహించే మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని పోలీసుల నుంచి తమకు లేఖ వచ్చిందని... ర్యాలీ ఎక్కడ చేయాలో మీరే చెప్పాలని, మీరు చెప్పిన మార్గంలోనే ర్యాలీ చేస్తామని పోలీసులకు తాము మరో లేఖ రాశామని చెప్పారు. అయితే, తమ లేఖకు పోలీసుల నుంచి ఇంత వరకు సమాధానం రాలేదని అన్నారు. తాము ర్యాలీని వాయిదా వేసుకోలేదని... ర్యాలీని నిర్వహించి తీరుతామని చెప్పారు. తమ వ్యూహాలు తమకు ఉన్నాయని తెలిపారు.

బీజేపీ కవాతుకు, ఎంఐఎం సభకు అనుమతిచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ర్యాలీని అడ్డుకోవాలనుకోవడం సరికాదని భట్టి విక్రమార్క అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండు పార్టీలూ బీజేపీకి మద్దతు పలుకుతున్నాయని చెప్పారు. కేసీఆర్ వైఖరిని ప్రజలకు వివరిస్తామని అన్నారు. కేసీఆర్ కు కాంగ్రెస్ భయం పట్టుకుందని... అందుకే తమను అడ్డుకుంటున్నారని చెప్పారు.

More Telugu News