Maharashtra: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే మొదలైన అసంతృప్తి!

  • హోం మంత్రి పదవిని ఎన్సీపీకి ఇచ్చేందుకు సిద్ధమైన ఉద్ధవ్
  • కాంగ్రెస్ కు ప్రాధాన్యత లేని శాఖలు
  • తీవ్ర నిరాశలో కాంగ్రెస్

మహారాష్ట్రలో బీజేపీకి షాక్ ఇస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. థాకరేల కుటుంబం నుంచి తొలిసారి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో ఏర్పాటైన ఈ సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే అసంతృప్తి ప్రారంభమైందని అంటున్నారు. వాస్తవానికి స్పీకర్ పదవిని కాంగ్రెస్ కు ఇచ్చి, హోం మంత్రి పదవిని శివసేన తీసుకోవాలని భావించారు. కానీ, హోం మంత్రి పదవిని ఎన్సీపీకి ఇచ్చేందుకు తాజాగా శివసేన సిద్ధం కావడంతో... ఆ పార్టీకి తగిన ప్రాధాన్యత లభించినట్టైంది.

అయితే, తమకు ఇవ్వజూపుతున్న పదవుల పట్ల కాంగ్రెస్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, సహకార, వ్యవసాయ శాఖలను కాంగ్రెస్ ఆశించింది. కానీ, ఆ పార్టీకి ప్రాధాన్యత లేని, ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండని శాఖలను ఇవ్వాలని ఉద్ధవ్ నిర్ణయించారట. దీంతో, కాంగ్రెస్ తీవ్ర నిరాశకు గురవుతోంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులైనా గడవక ముందే అసంతృప్త జ్వాలలు మొదలవడంతో... ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు మనుగడ సాగిస్తుందో అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

More Telugu News