Devendra Fadnavis: మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్యకు షాకిచ్చిన ‘మహా’ సర్కారు

  • మున్సిపల్ సిబ్బంది వేతనాలు యాక్సిస్ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మార్పు
  • యాక్సిస్‌ బ్యాంకులో పనిచేస్తున్న దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత
  • మండిపడుతున్న ప్రతిపక్షాలు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌కు మహారాష్ట్ర సర్కారు ఝలక్కిచ్చింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రస్తుతం యాక్సిస్ బ్యాంకు నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. తాజాగా, ఈ జీతాలను యాక్సిస్ బ్యాంకు నుంచి కేంద్రం అధీనంలో ఉన్న మరో బ్యాంకుకు మార్చబోతున్నట్టు థానే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నరేశ్ మాస్కే ప్రకటించారు. యాక్సిస్ బ్యాంకులో అమృత ఫడ్నవీస్ పనిచేస్తుండడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, ఇటీవల రాహుల్ గాంధీ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తాను సావర్కర్‌ను కాదని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఇస్తూ సావర్కర్ గురించి రాహుల్‌కు ఒక్క ముక్క కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్‌ను ఆయన భార్య అమృత ఫడ్నవీస్ రీట్వీట్ చేస్తూ.. థాకరే అనే పేరును తగిలించుకున్నంత మాత్రాన అందరూ థాకరేలు అయిపోరంటూ ఉద్ధవ్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు.

అమృత ట్వీట్‌కు శివసేన మహిళా నేత ప్రియాంక చతుర్వేది అంతే ఘాటుగా బదులిచ్చారు. ఉద్దవ్ పేరుకు తగ్గట్టుగానే జీవిస్తున్నారని, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమృతను లక్ష్యంగా చేసుకునే ప్రభుత్వం మున్సిపల్ సిబ్బంది వేతనాలను యాక్సిస్ నుంచి మరో బ్యాంకుకు మార్చుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

More Telugu News