amraravathi: జగన్ స్థానంలో రాజశేఖరరెడ్డి ఉంటే ఇలా చేసేవారు కాదు.. ఇది ముమ్మాటికీ తుగ్లక్ చర్యే!: రాజధాని మార్పుపై ప్రముఖ పాత్రికేయుడు శేఖర్ గుప్తా తీవ్ర వ్యాఖ్యలు

  • జగన్ నిర్ణయం ఈ దశాబ్దంలోనే జాతీయ విషాదం
  • వైఎస్ ఉండి ఉంటే చంద్రబాబు కంటే మరింత బాగా అమరావతిని నిర్మించేవారు
  • తుగ్లక్ డబుల్ కెఫిన్‌తో 20 కాఫీలు తాగి తీసుకున్న నిర్ణయంలా ఉంది

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను జాతీయ విషాదంగా అభివర్ణించారు ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, ‘ద ప్రింట్’ ఎడిటర్ ఇన్ చీఫ్ శేఖర్ గుప్తా. ఇది ముమ్మాటికి పిచ్చి, తుగ్లక్ చర్యేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణాన్ని పునరుద్ధరించాల్సిందిగా జగన్‌కు ప్రధాని మోదీ సూచించాలని అన్నారు. జగన్ స్థానంలో కనుక ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే చంద్రబాబు కంటే మరింత గొప్పగా అమరావతి నిర్మాణం ఉండేదన్నారు. ఈ మేరకు 20 నిమిషాల వీడియోను శేఖర్ గుప్తా పోస్టు చేశారు.  

దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని ఏపీకి మూడు రాజధానులు ప్రతిపాదించడం ఈ శతాబ్దంలోనే జాతీయ విషాదంగా మిగులుతుందని శేఖర్ గుప్తా అభిప్రాయపడ్డారు.  చూస్తుంటే ఏపీ పాలకులపై తుగ్లక్ ప్రభావం బలంగా ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. ఏపీలో చెడు ఆలోచనలు బలంగా ప్రబలుతున్నాయని, వాటిని ఎవరూ ఆపలేరని అన్నారు. వీటిని అడ్డుకునేందుకు కొద్దిమంది మాత్రమే ప్రయత్నిస్తారని అన్నారు.

ఏపీకి మూడు రాజధానులే కాకుండా విశాఖ, అమరావతిలలో హైకోర్టు బెంచ్‌లు పెడతామని చెబుతున్నారని,  వేసవిలో శాసనసభ సమావేశాలను విశాఖలో జరుపుతామని చెబుతున్నారని, ఇదంతా చూశాక తుగ్లక్ డబుల్ కెఫిన్‌తో 20 కప్పుల కాఫీ తాగి తీసుకున్న నిర్ణయంలా ఉందని శేఖర్ గుప్తా ఎద్దేవా చేశారు.

More Telugu News