Jagan: సీఎం జగన్ చేసిన పలు ఆరోపణలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది: చంద్రబాబునాయుడు

  • ఒకే సామాజిక వర్గం లాభపడేందుకే  అమరావతా?
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందా?
  • ప్రభుత్వం వద్ద డబ్బు లేదన్న మాట అబద్ధం

ప్రజా రాజధాని అమరావతి, పదమూడు జిల్లాలకు ఆదాయం సమకూర్చే రాజధాని ఇదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒకే సామాజిక వర్గం లాభపడేందుకే రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, వరదలు వస్తే రాజధాని ప్రాంతం మునిగిపోతుందని గ్రీన్ టైబ్ర్యునల్ చెప్పిందని, రాజధానిలో నిర్మాణాలకు పునాదులు వేసేందుకే చాలా డబ్బులు ఖర్చు అవుతుందని.. అంత ఖర్చు చేయలేమని, అసైన్డ్ ల్యాండ్స్ లో అవకతవకలు జరిగాయంటూ సీఎం జగన్ నిన్నటి వరకు రకరకాల ఆరోపణలు చేశారని అన్నారు.

ఈ విషయమై చర్చ జరగాల్సిన, దీనిపై ప్రతిఒక్కరూ మాట్లాడాల్సిన  అవసరం ఉందని చెప్పారు. సంపద ఏ రకంగా సృష్టించాలో ప్రభుత్వానికి తెలుసా? అని ప్రశ్నించారు. వేరే ప్రాంతానికి వెళితే హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీలు నిర్మించాలిగా? డబ్బు ఖర్చు అవుతుందిగా.. మరి, డబ్బులు లేవని ప్రభుత్వం చెప్పడం ఓ నెపం మాత్రమేనని విమర్శించారు. అమరావతిలో కొనసాగిన జగన్ ఏడు నెలల పాలన చెట్టు కింద చేశారా? అసెంబ్లీలో కూర్చో లేదా? సెక్రటేరియట్ లో కూర్చుని పని చేయట్లేదా? ఈరోజు కేబినెట్ మీటింగ్ ఎక్కడ పెట్టారు? అక్కడ హాల్ లో కాదా? వీటన్నింటిని ఉపయోగించుకోకూడదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అమరావతిలో ఒకే సామాజిక వర్గం ఉందన్న వైసీపీ నేతలు, ఈరోజున ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని రాజధాని నిర్మాణం సాధ్యం కాదని చెబుతుండటం కరెక్టు కాదని అన్నారు.

More Telugu News