Telangana: సాంకేతికత పేదల బతుకులు మార్చేందుకు ఉపయోగపడాలి: గవర్నర్ తమిళిసై

  • కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతం 
  • వ్యర్థాల నిర్వహణలో కూడా సాంకేతికతను ఉపయోగించాలి
  • మురుగు నీటిని శుద్ధిచేస్తే వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు

దేశం సాంకేతికంగా ముందుకు దూసుకుపోతోందని తెలంగాణ గవర్నర్ తమిళిసై చెబుతూ.. ఆ సాంకేతికత పేదల బతుకులు మార్చేందుకు ఉపయోగపడాలని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని  హెచ్ఐసీసీలో జరిగిన 34వ భారతీయ ఇంజినీరింగ్ మహాసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగించిన సాంకేతికత, ఇంజినీరింగ్ ను మెచ్చుకున్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టును ఇటీవల సందర్శించాను. ప్రాజెక్టులో ఎక్కువ శాతం దేశీయంగా రూపొందించిన సాంకేతికతనే వాడారు. ఇది చాలా గర్వకారణం’ అని ప్రశంసించారు.

వ్యర్థాల నిర్వహణలో కూడా సాంకేతికతను ఉపయోగించాలని  ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. ముంబయిలో రెండువందల కోట్ల లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోందని.. మంచి సాంకేతిక పరిజ్ఞానంతో మురుగు నీటిని శుద్ధిచేస్తే వేల ఎకరాలకు సాగునీరు అందించ వచ్చని చెప్పారు. ప్రపంచ అభివృద్ధికోసం ఇంజినీర్లు చేస్తున్న కృషిని అభినందించారు. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు సహజవనరుల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఇందుకోసం కొత్త ఆవిష్కరణలు చేయాలని ఆమె శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో అత్యున్నత ఇంజినీరింగ్ పరిజ్ఞానాన్ని వాడటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  ఇంజినీర్ల అద్భుత నైపుణ్యంతో ఈ ప్రాజెక్టులు విజయవంతమైనాయని పేర్కొన్నారు.

More Telugu News