Perni Nani: ఆ రెండు నివేదికలను ఓ హైపవర్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది: పేర్ని నాని

  • ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ
  • మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు
  • ఆసక్తికర విషయాలు వెల్లడి

ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ నివేదిక మంత్రివర్గం ముందుకువచ్చిందని ఏపీ మంత్రి పేర్ని నాని వివరించారు. జీఎన్ రావు కమిటీ నివేదిక గురించి మంత్రిమండలి సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు. అయితే త్వరలోనే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక రానుందని, ఆపై ఓ హైపవర్ కమిటీ రెండు నివేదికలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ కమిటీలో మంత్రులతో పాటు సీనియర్ అధికారులు కూడా ఉంటారని, జనవరి మొదటివారంలో ఈ కమిటీ పని ప్రారంభిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా మంత్రిమండలిలో ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.

అంతేగాకుండా, గత ప్రభుత్వం రాజధానిపై తీసుకున్న నిర్ణయాలను కూడా పేర్ని నాని వివరించారు. ఎంతో నిపుణుడైన శివరామకృష్ణ కమిటీ నివేదిక కాదని, మంత్రి నారాయణ నివేదిక ఆధారంగా భూసమీకరణ చేపట్టారని వెల్లడించారు. వాస్తవాలను విస్మరించి గత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంకల్పించిందని చెప్పారు. లక్ష 9 వేల కోట్ల పెట్టుబడులు అవసరం అని భావించి కేవలం 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగిందని విమర్శించారు. ఎంతో అనుభవజ్ఞుడైన గత సీఎం ఘనత ఇదని ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు తేవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ప్రజలు అంచనా వేయాలని అన్నారు. అప్పటి ఆర్థికమంత్రి కూడా దీనిపై చేతులెత్తేశారని, మేం తేగలిగినంత తెచ్చాం, ఇంకెవరు అప్పు ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారని పేర్ని నాని గుర్తుచేశారు.

More Telugu News