Tribal dance festival: గిరిజన నృత్యోత్సవంలో రాహుల్ గాంధీ డ్యాన్స్

  • డోలు వాయిస్తూ.. గిరిజనులతో మమేకం
  • దేశం  రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం.. వంటి సమస్యలను ఎదుర్కొంటోందన్న నేత
  • అన్ని జాతులు, మతాలు, తెగల ప్రజలను సమన్వయం చేసుకుంటూ సాగాలని వ్యాఖ్య 

జాతీయ గిరిజన నృత్యోత్సవంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ వేదికగా సాగుతున్న ఈ ఉత్సవాలను రాహుల్ ప్రారంభించారు. రాయ్ పూర్ లోని సైన్స్ కాలేజీ మైదానంలో ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో రాహుల్ పాటు, రాష్ట్ర సీఎం భూపేశ్ భగేల్, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ నృత్యోత్సవాల్లో ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం 24 రాష్ట్రాల నుంచి నృత్యకారుల బృందాలు పాల్గొంటున్నాయి.

ఈ వేడుకల్లో రాహుల్ గాంధీ గిరిజనులతో మమేకమైనారు. చేతిలో డోలు పట్టుకొని వాయిస్తూ.. వారి నృత్యాన్ని అనుకరించారు. రాహుల్ నృత్యాన్ని రికార్డు చేసిన ఆ రాష్ట్ర కాంగ్రెస్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ తమ ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేశాయి. ఈ వీడియోకు కాంగ్రెస్ శ్రేణుల నుంచేకాక, సాధారణ నెటిజన్ల నుంచి కూడా లైకులు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సందర్బంగా రాహుల్ ప్రసంగిస్తూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడ్డారు.  పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో, రాష్ట్రాల్లో చెలరేగుతున్న ఆందోళనలను ప్రస్తావించారు.‘ఇప్పుడు దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ మందగమనం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని కూడా తెలుసు. నేను చెప్పదలచుకున్నదొక్కటే.. అన్ని జాతులు, మతాలు, తెగల ప్రజలను సమన్వయం చేసుకుంటూ వెళ్లకపోతే దేశాన్ని ముందుకు నడిపించలేం’ అని అన్నారు

More Telugu News