ys jagan: కొత్త రాజధాని పేరేంటి? జగన్ మనసులో ఏముంది?... సర్వత్ర ఉత్కంఠ!

  • రాష్ట్రమంతా మంత్రివర్గ సమావేశంపై చర్చ
  • రాజధాని రైతులకు భరోసానిచ్చేలా నిర్ణయాలు
  • సచివాలయానికి చేరుకున్న వైఎస్ జగన్

నేడు జరగనున్న ఏపీ క్యాబినెట్ భేటీ సర్వత్ర ఉత్కంఠను రేపుతోంది. మూడు రాజధానుల ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడవచ్చన్న వార్తల నేపథ్యంలో, ఎక్కడ చూసినా ప్రజలు మంత్రివర్గ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలపైనే చర్చించుకుంటున్నారు. అమరావతి విషయంలో ఏం జరగబోతోంది? క్యాబినెట్ నిర్ణయం ఎలా ఉంటుంది? ఆంధ్ర చరిత్రలో డిసెంబర్ 27 చిరస్థాయిగా మిగులుతుందా? వంటి ప్రశ్నలకు సమాధానం ఈ మధ్యాహ్నం తరువాత తెలుస్తుంది.

ఇప్పటికే మూడు రాజధానులపై సూత్ర ప్రాయంగా వెల్లడించిన జగన్ సర్కారు, ఆ దిశగా అడుగులు వేస్తుందా? లేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. జీఎన్ రావు కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదిస్తే మాత్రం ఆ వెంటనే ప్రాంతీయ కమిటీలు, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ అన్న ప్రకటన, కర్నూలులో శాశ్వత హైకోర్టుకు గ్రీన్ సిగ్నల్ వెలువడవచ్చని సమాచారం.

ఇక ఇదే సమయంలో అమరావతి రైతులకు భరోసాను ఇచ్చేలా జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. రైతుల్లో నెలకొన్న ఆందోళనను చల్లార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశంపైనా ఆసక్తి నెలకొంది. కాగా, ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ వెలగపూడి సచివాలయానికి చేరుకున్నారు. మంత్రులు సైతం చేరుకోగా, కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది.

More Telugu News