Crime News: కొడుకుపై ప్రేమతో తల్లిదండ్రుల చోరీ డ్రామా: బెడిసికొట్టిన పథకం

  • ఇద్దరి కొడుకుల్లో ఒకరు ఆర్థికంగా స్థితిమంతుడు 
  • మరో కొడుకుకి ఇబ్బందులు 
  • దొంగతనం డ్రామాతో సొత్తు అతని సొంతం చేయాలని ప్లాన్

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొడుకుకు మేలు చేయాలన్న తాపత్రయంలో మరో కొడుకు దృష్టి మళ్లించేందుకు తల్లిదండ్రులు నడిపిన చోరీ నాటకం పోలీసుల రంగప్రవేశంతో బెడిసికొట్టింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇవి.

పలాస కె.టి.రోడ్డులో కె.రామారావు, అనురాధ దంపతులు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు కాగా పెద్దకొడుకు శివకృష్ణ విశాఖలో ప్రయివేటు ఉద్యోగి. చిన్నకొడుకు విజయ్ కృష్ణ సౌదీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. దంపతుల వద్ద 25 తులాల బంగారం ఉంది.

పెద్దకొడుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడంతో ఈ మొత్తం బంగారం అతని పరం చేయాలని యోచించారు. కాని ఇందుకు చిన్న కొడుకు అభ్యంతరం చెబుతాడేమోనన్న అనుమానం వచ్చింది. అందువల్ల చోరీ నాటకం ఆడి బంగారం పోయిందని చెబితే కొడుకు ఏమీ అనలేడని, ఆ తర్వాత సొత్తు మొత్తం పెద్దకొడుకుకు ఇచ్చేయవచ్చునని దంపతులు పథకం రచించారు.

ఇందులో భాగంగా బుధవారం రాత్రి తమ ప్రణాళిక అమల్లోకి తెచ్చారు. బీరువా తలుపులు తెరిచి అందులోని వస్తువులు చిందరవందరగా పడేశారు. నిన్న ఉదయం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తాము మేడపై నిద్రిస్తుండగా రాత్రి ఇంట్లో చోరీ జరిగిందని, 25 తులాల బంగారం, లక్షన్నర నగదు పోయాయని ఫిర్యాదు చేశారు.

భారీ చోరీ జరగడంతో కాశీబుగ్గ పోలీసులు హడావుడి పడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో జల్లెడపట్టారు. విచారణలో బీరువా తలుపులపై దంపతుల వేలిముద్రలు తప్ప మరొకరివి లేకపోవడం, ఇంటి తలుపులు వేసే ఉండడం, దంపతుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో సందేహపడ్డారు.

ఇది ఇంటి దొంగలపనే అని ఊహించి దంపతులను గట్టిగా విచారించడంతో అసలు నిజం చెప్పేశారు. పెద్దకొడుకుపై ప్రేమతో ఈ నాటకానికి తెరలేపారని తెలిసి మందలించి విడిచి పెట్టేశారు.

More Telugu News