Telangana: కొత్త విమానాశ్రయాల కోసం తెలంగాణ సర్కారు తీవ్ర ప్రయత్నాలు!

  • ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి నిర్ణయం
  • ఏఏఐ సహాయాన్ని కోరుతున్న తెలంగాణ సర్కారు
  • త్వరలోనే సవివరమైన నివేదిక

తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచాలన్న కృత నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ఏఏఐ (ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) సహాయాన్ని కోరుతోంది. ఏరోనాటికల్ సర్వేతో పాటు ఏ ఏ ప్రాంతాల్లో విమానాశ్రయాలుంటే నిర్వహణపరంగా నష్టాలుండవు... వంటి అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని సూచించింది. ఆరు విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేసీఆర్ సర్కారు, అందులో మూడింటిని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులుగా నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది.

వరంగల్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామన్నూరు, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే విమానాశ్రయాలకు స్థలాన్వేషణ జరుగగా, పెద్దపల్లి జిల్లాలోని బసంతనగర్, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి, మహబూబ్ నగర్ జిల్లాలోని గుడిబండ ప్రాంతాలు అనుకూలమని గతంలోనే ఏఏఐ వెల్లడించింది.

ఇప్పటికే జరిగిన ప్రాథమిక అధ్యయనాల ప్రకారం, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్ పోర్టులు లాభదాయకమని వెల్లడికాగా, మిగతా విమానాశ్రయాలు ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు ఉపకరించనున్నాయని పరిశ్రమ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ విమానాశ్రయాలను పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్) విధానంలో అభివృద్ధి చేయాలా లేక రాష్ట్ర ప్రభుత్వమే టెండర్లను పిలిచి నిర్మించాలా? అన్న విషయమై ఇంతవరకూ స్పష్టత రాలేదు.

కాగా, ఈ సంవత్సరం ఆగస్టు 21న ఏఏఐ కన్సల్టెన్సీ అధికారుల బృందం బసంత్ నగర్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న విమానాశ్రయ ప్రాంతాన్ని సందర్శించింది. ఇక్కడి ప్రయాణికుల డిమాండ్ ను అధ్యయనం చేసింది. వాస్తవానికి ఇక్కడ ఇదివరకే ఎయిర్ స్ట్రిప్ ఉంది. దీన్ని కేశోరాం సిమెంట్ కర్మాగారం సొంతంగా ఏర్పాటు చేసుకోగా, దాని యజమాని బీకే బిర్లా ప్రతి సంవత్సరం ఫ్యాక్టరీని చూసేందుకు చిన్న విమానంలో వచ్చేవారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ కు విమానాలు కూడా నడిచేవి. గత 15 సంవత్సరాలుగా ఈ ఎయిర్ స్ట్రిప్ నిరుపయోగంగా ఉంది.

ఇక ఆదిలాబాద్ విమానాశ్రయం విషయానికి వస్తే, రక్షణ శాఖ ఆసక్తితో ఉంది. ఇక్కడ ఇప్పటికే 350 ఎకరాల స్థలం సిద్ధంగా ఉండగా, మరో 600 ఎకరాల భూ సేకరణ చేయాల్సివుంది. ఈ ప్రాంతం దేశంలోని మధ్య భూభాగంలో ఉండటంతో వ్యూహాత్మక అవసరాలకు కూడా దీన్ని వినియోగించుకోవచ్చని రక్షణ శాఖ భావిస్తోంది.

వరంగల్ విమానాశ్రయానికి 429 ఎకరాల భూమి ఇప్పటికే సిద్ధంగా ఉండగా, మరో 400 ఎకరాలు అవసరమని ఏఏఐ అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, జీఎంఆర్ కు కుదిరిన ఒప్పందం ప్రకారం, శంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల దూరం వరకూ మరో విమానాశ్రయాన్ని నిర్మించే వీలు లేదు. దీంతో వరంగల్ విమానాశ్రయానికి అడ్డంకులు ఏర్పడుతున్నప్పటికీ, మెగా టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధి చెందుతున్నందున ఇక్కడ విమానాశ్రయ ఏర్పాటుపై కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది.

More Telugu News