Telugudesam: టీడీపీ నాయకులను ఇళ్ల నుంచి కదలనివ్వని ఏపీ పోలీసులు!

  • నేడు ఏపీ క్యాబినెట్ మీటింగ్
  • టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసుల పహారా
  • జగన్ ఓ డిక్టేటరన్న చంద్రబాబు

నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్, క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనుండటం, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, రైతులు మహాధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మూడు రాజధానుల విధానంపై మంత్రివర్గం నేడు కీలక నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో, విజయవాడలోని అందరు టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.

తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలను పోలీసులు ఈ ఉదయం ఇంటి నుంచి కదలనివ్వలేదు. వీరు ప్రకాశం బ్యారేజ్ వద్ద 'రాజధాని పరిరక్షణ సమితి' పిలుపునిచ్చిన నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరగా, వారిని నిలువరించారు. పలువురు స్థానిక నేతలను కూడా పోలీసులు నిన్నటి నుంచి గృహ నిర్బంధంలో ఉంచగా, చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.

రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని, అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనలకు గురి చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ఓ డిక్టేటర్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, పోలీసుల రాజ్యాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఉంచరన్న ఆందోళనను పెంచుతున్నారని అన్నారు. విభజన రాజకీయాలను నడుపుతున్నారని, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

More Telugu News