Guntur District: గుంటూరు, కృష్ణా నేతల ప్రెస్ మీట్ లో వారి మొహాలు చూస్తేనే అమరావతి నిజమా, గ్రాఫిక్సా అనేది అర్థమవుతుంది: నారా లోకేశ్

  • గుంటూరు, కృష్ణా నేతలతో సీఎం జగన్ సమావేశం
  • అనంతరం వైసీపీ నేతల ప్రెస్ మీట్
  • విమర్శనాస్త్రాలు సంధించిన నారా లోకేశ్

ఏపీ రాజధాని అమరావతి రైతుల ఆందోళనలపై చర్చించేందుకు సీఎం జగన్ గుంటూరు, కృష్ణా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. అనంతరం వైసీపీ నేతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ నేతల పరిస్థితి ఎన్ని చేసినా కుక్క తోక వంకరే అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

కృష్ణా, గుంటూరు వైసీపీ నేతల ప్రెస్ మీట్ లో వారి ముఖాలు చూస్తేనే అమరావతి నిజమా, గ్రాఫిక్సా? అనేది అర్థమవుతుందని తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు చేసి నిరూపించలేకపోయారని, రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానపర్చారని మండిపడ్డారు. ఇప్పుడు భూములు ఇచ్చిన రైతులకు ఏం జవాబు చెప్పాలో తెలియక తలదించుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఎన్నికల సమయంలో అమరావతే రాజధాని అని నమ్మకంగా చెప్పారని, మ్యానిఫెస్టోలో కూడా పెడుతున్నాం అని చెప్పారని నారా లోకేశ్ గుర్తుచేశారు. అంతేకాకుండా, అసెంబ్లీ సాక్షిగా అమరావతికి జై కొట్టారని, అద్భుతమైన రాజధాని నిర్మించాలంటే 30 వేల ఎకరాలు ఉండాలని కూడా జగన్ అన్నారని వివరించారు.

ఇన్ని తెలిసిన జగన్ గారికి ఆ రోజు రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో తెలియదా? అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతుంది కాబట్టే రాజధానిని తరలించాం అంటున్న వైసీపీ మేధావులకు మరోసారి చెబుతున్నా, అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. ఇక, అమరావతి గ్రాఫిక్స్ అంటున్న వైసీపీ గ్రాఫిక్స్ నేతల కోసం అమరావతి వాస్తవ స్వరూపాన్ని మరోసారి చూపిస్తున్నా అంటూ అమరావతి నిర్మాణాల ఫొటోలను పోస్టు చేశారు.

More Telugu News