Cricket: ఆసియా ఎలెవన్ జట్టులో పాక్ క్రికెటర్లు ఉండరు: బీసీసీఐ

  • షేక్ ముజిబుర్ రెహ్మాన్ శత జయంతిని పురస్కరించుకుని టీ 20 మ్యాచ్ లు
  • ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య పోటీ  
  • ఆసియా ఎలెవన్ జట్టులో ఆడే ఐదుగురు ఆటగాళ్లను ఎంపిక చేయనున్న గంగూలీ

బంగ్లాదేశ్ వేదికగా ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య జరిగే రెండు టీ 20 మ్యాచ్ లకు ఆ దేశ క్రికెట్ బోర్డు సన్నాహాలు ప్రారంభించింది. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ శత జయంతిని పురస్కరించుకుని ఈ మ్యాచ్ లు నిర్వహిస్తోంది. మరోవైపు ఐసీసీ ఈ మ్యాచ్ లను అధికారికంగా గుర్తించినట్లు సమాచారం. ఆసియా జట్టులో ఆడే క్రికెటర్లలో పాక్ ఆటగాళ్లు ఉండే అవకాశంలేదని తెలుస్తోంది. ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు దెబ్బతినడంతో.. ఆసియా ఎలెవన్ జట్టులో ఈ రెండు జట్ల ఆటగాళ్లు కలిసి ఆడే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.

దీనిపై బీసీసీఐ జాయింట్ సెక్రటరీ జయేశ్ జార్జ్ మాట్లాడుతూ.. ఆసియా ఎలెవన్ జట్టులో ఇరు జట్ల ఆటగాళ్లు ఉండే అవకాశం లేదని, పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆహ్వానం లేదన్న సమాచారం తమకుందని పేర్కొన్నారు. ‘ఆసియా ఎలెవన్ జట్టులో పాకిస్థాన్ ఆటగాళ్లు ఉండరన్న విషయంలో మాకు స్పష్టత ఉంది. ఆసియా ఎలెవన్ జట్టులో ఆడే ఐదుగురు ఆటగాళ్లను బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఎంపిక చేస్తారు. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకే జట్టులో ఉండి ఒక్క ఓవర్ కూడా ఆడే అవకాశం లేదు’ అని అన్నారు.

More Telugu News