Botsa Satyanarayana: రాజధాని ప్రాంత రైతులు భయపడక్కర్లేదు!: బొత్స భరోసా

  • అమరావతిలో ఇప్పటివరకు పెట్టిన ఖర్చు వృథా కాదు
  • అసెంబ్లీ భవనం అక్కడే..సెక్రటేరియట్ మాత్రమే వెళ్లిపోతుంది
  • చంద్రబాబు రాజధాని పేర రైతులను మోసం చేశారు
  • రాజధాని ప్రాంత రైతులకిచ్చిన హామీలను నెరవేరుస్తాం

మూడు రాజధానులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఆర్డీఏ కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిపేర రైతులను మోసం చేసిన చంద్రబాబు, ఇంకా రైతులను మభ్య పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలను నమ్మవద్దని రైతులకు సూచించారు. రైతులకిచ్చిన హామీలను తాము నెరవేరుస్తామన్నారు.

అమరావతినుంచి ఒక్క సెక్రటేరియట్ వెళ్లిపోయినంత మాత్రాన అభివృద్ధి ఆగదన్నారు. అన్ని వివరాలు రేపటి కేబినెట్ భేటీలో స్పష్టమవుతాయన్నారు. 13 జిల్లాల సమాన అభివృద్ధే ద్యేయంగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. రాష్ట్రంలోని ఆర్ధిక పరిస్థితిని కూడా తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని, చంద్రబాబుకు ఐదేళ్లపాటు అవకాశమిస్తే... రూ.50 వేల కోట్లున్న అప్పులను రూ. 2 లక్షల 50 వేల కోట్లకు పెంచారని విమర్శించారు.  

రాజధాని ప్రాంత రైతులు భయపడక్కర్లేదని బొత్స పేర్కొన్నారు. అమరావతికోసం ఇప్పటికే రూ.5,458 కోట్లు అక్కడ ఖర్చుచేశారన్నారు. రూ.1,95,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే అందులో ఖర్చు పెట్టింది నామ మాత్రమే అని బొత్స చెప్పారు. ఇందులో రూ.1,500 కోట్లు కేంద్రమే ఇచ్చిందన్నారు. రాజధాని నిర్మాణానికి అయ్యే ప్రాథమిక అంచనా వ్యయం అప్పట్లో లక్షా తొమ్మిదివేల కోట్ల రూపాయలన్నారు. అవి ఎంతవరకు పెరుగుతాయో అంచనా వేయలేమన్నారు. అమరావతిలో ఇప్పటివరకు పెట్టిన ఖర్చు వృథా కాదన్నారు. అక్కడ అసెంబ్లీ నిర్మాణంపై రేపటి కేబినెట్ లో నిర్ణయం చేస్తామన్నారు. అక్కడి 29 గ్రామాల రైతులు, ప్రజల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

More Telugu News