మావి అబద్ధాలు కావు.. మీవే అబద్ధాలు: మోదీపై రాహుల్ విమర్శ

26-12-2019 Thu 17:11
  • ఎన్నార్సీలో చోటు దక్కని ముస్లింలను నిర్బంధ కేంద్రాలకు పంపుతారా?
  • మోదీ భారతమాతకే అబద్ధాలు చెబుతున్నారు  
  • అసోంలో నిర్మిస్తున్న ఓ నిర్బంధ కేంద్రం వీడియో పోస్ట్ చేసిన రాహుల్

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయంటూ.. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ అబద్ధాలు చెబుతున్నారంటూ విమర్శలు చేశారు. ఆదివారం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎన్నార్సీ జాబితాలో చోటు దక్కని ముస్లింలను నిర్బంధ కేంద్రాలకు పంపుతారంటూ ప్రతిపక్షాలు వదంతులు వ్యాప్తి చేస్తున్నాయని మోదీ ఆరోపణలు చేశారు. సీఏఏ, ఎన్నార్సీలపై ఆ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ప్రధాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాహుల్ ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు. ‘మోదీ భారతమాతకే అబద్ధాలు చెబుతున్నారు’ అని కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో పాటు అసోంలో నిర్మాణ దశలో ఉన్నట్లుగా చెబుతున్న ఓ నిర్బంధ కేంద్రం దృశ్యాలు, ఢిల్లీ సభలో మోదీ చేసిన విమర్శలకు సంబంధించిన దృశ్యాలతో కూడిన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.