ఏపీకి ‘జగన్ గ్రహణం‘ ఇంకా నాలుగేళ్ల నాలుగు నెలలు ఉంటుంది: కూన రవికుమార్

26-12-2019 Thu 17:03
  • ఈ కొత్త గ్రహణం ద్వారా జరిగే అరాచకాలను అడ్డుకోవాలి
  • ప్రజల్లోనే చైతన్యం రావాలి
  • ఆ వ్యాఖ్యలు చేసేందుకు విజయసాయిరెడ్డి ఎవరు?

ఏపీకి జగన్ గ్రహణం ఇంకా నాలుగేళ్ల నాలుగు నెలలు ఉందని టీడీపీ నాయకుడు కూన రవికుమార్ విమర్శించారు. ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. సూర్యగ్రహణం రోజున రేడియేషన్ ఎక్కువగా ఉండే కిరణాలు భూమిలోకి వెళ్లకుండా వాటిని  నిరోధించేందుకు అడ్డుగా దర్బ గడ్డి ఉంటుంది, మరి, ఈరోజున ‘జగన్’ అనే కొత్త గ్రహణం ద్వారా జరిగే అరాచకాలను, అన్యాయాలను అడ్డుకోవాలంటే ప్రజల్లోనే చైతన్యం రావాలని పిలుపు నిచ్చారు.

ఆ అధికారం విజయసాయిరెడ్డికి ఉందా?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపైనా కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి మూడు రాజధానులు వస్తాయని విజయసాయిరెడ్డి ఇటీవలే వ్యాఖ్యానించారని, అసలు, ఆ వ్యాఖ్యలు చేసేందుకు ఆయన ఎవరు? ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏంటి? ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించే అధికారం విజయసాయిరెడ్డికి ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.